సిద్దిపేట: సిద్దిపేటలో ఏటా నిర్వహించే హాఫ్ మారథాన్ (Half Marathon) ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం సిద్దిపేట శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై హాఫ్ మారథాన్‌ను నిర్వహించారు. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు శాఖ సహకారంతో హాఫ్ మారథాన్-3కి సిద్దిపేటతోపాటు ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్‌రావు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతోపాటు జిల్లాస్థాయి అధికారులు, పలువురు సినీ నటులు పాల్గొన్నారు. 5K, 10K, 21K రన్లో మొదటి ముగ్గురు విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు.
2023 మార్చి 8న సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఏర్పాటైంది. ప్రస్తుతం 200 మందికి పైగా సభ్యులు ఉన్నారు. పరుగెత్తుతూ.. ఆరోగ్యంగా జీవిద్దాం అనే లక్ష్యంతో ఆవిర్భవించిన ఈ సంఘంలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వివిధ వృత్తులు, వయసుల వారున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగే పోటీల్లో అసోసియేషన్ సభ్యులు పాల్గొని పతకాలు సాధిస్తున్నారు. 100 మంది మారథాన్ స్థాయికి ఎదిగారు.
సిద్దిపేట వేదికగా హాఫ్ మారథాన్ నిర్వహణకు రెండు నెలలుగా కసరత్తు చేశారు. 40 మందితో కార్వనిర్వాహక కమిటీ ఏర్పాటైంది. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేశారు. రెండు నెలల కిందట ఆన్లైన్లో నమోదు ప్రారంభించారు. హాఫ్ మారథాన్‌లో 300 మంది, 10 కి.మీ. విభాగంలో 250 మంది, 5 కి.మీ. విభాగంలో 2550 మంది నమోదు చేసుకున్నారు.