సిద్దిపేట, జూలై 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పారిశుధ్యం, అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. సిద్దిపేట(499), మెదక్(469), సంగారెడ్డి(647) జిల్లాల్లో మొత్తం 1615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు. ఫిబ్రవరి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. ప్రత్యేకాధికారుల పాలనకు ముందే పంచాయతీల్లో నిధులు ఖాళీ అయ్యాయి. ఫలితంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి గ్రామాల్లో నెలకొన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆరు నెలలుగా ఒక్కో పంచాయతీ కార్యదర్శి లక్ష వరకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. బీఆర్ఎస్ హయాంలో గ్రామాల అభివృద్ధికి పల్లెప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చి నెలనెలా నిధులు సమకూర్చింది. ఫలితంగా గ్రామాల్లో పచ్చని పరిశుభ్ర వాతావరణం కనిపించింది. ఇవ్వాళ ఆరు నెలలుగా గ్రామాలకు నిధులు లేక పోవడంతో పారిశుధ్యం కంపు కొడుతున్నది. ఎక్కడి చెత్త అక్కడే కుప్పలుగా పేరుకుపోయింది.
జీపీ ఖాతాలు ఖాళీ..
గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవండతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని జీపీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. జీపీ బ్యాంక్ ఖాతాల్లో నిధులు లేకపోవడంతో ఖాతాలు ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా గ్రామాలకు మూడు రకాల ఖాతాలు ఉంటాయి. వీటిలో ఒకటి ఆస్తిపన్ను జమ చేసుకునే ఖాతా.. ప్రస్తుత పరిస్థితిల్లో ఆస్తి పన్ను అంతంత మాత్రంగానే వసూలు జరుగుతున్నది. రెండో ఖాతా ఎస్ఎఫ్సీ ఇందులో ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక నిధులను జమ చేస్తారు. ఆరు నెలలుగా ఈ ఖాతా పూర్తిగా ఖాళీగానే ఉంది. మూడో ఖాతాలో కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులను జమ చేస్తుంది. గ్రామాల్లో ఉండే జనాభా ప్రతిపాదికన ఈ నిధులను జమ చేస్తారు. ప్రతి మూడు లేదా నాలుగు నెలలకు ఒక్క సారి జమ అవుతాయి. వీటిని గ్రామాల్లో ప్రత్యేక పనులకు ఖర్చు చేసుకుంటారు.
అప్పుల పాలవుతున్న పంచాయతీ కార్యదర్శులు
నాలుగు నెలలుగా గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. గ్రామాలకు చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారే తప్ప సమస్య పరిష్కారానికి చొరవ చూపకుండా పూర్తిగా చేతులెత్తేశారు. ఫలితంగా భారమంతా పంచాయతీ కార్యదర్శులపైనే పడుతున్నది. ఇప్పటికే ఒక్కో పంచాయతీ కార్యదర్శి లక్షల్లో అప్పులు తీసుకొచ్చి పెడుతున్నారు. ప్రధానంగా గ్రామాల్లో పారిశుధ్యం పనులతోపాటు, మంచినీటి పైప్లైన్, బోర్ల మరమ్మతులు, పంచాయతీ ట్రాక్టర్ల నెలవారీ కిస్తీలు, విద్యు దీపాలు. విద్యుత్ బకాయిలన్నీ కార్యదర్శుల మీదనే పడుతున్నాయి.
ఆరు నెలలుగా కార్మికులకు జీతాలు లేవు
గ్రామాల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు లేవు. నెలనెలా జీతాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ వారిని పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం పక్కదారి పట్టింది. ఎక్కడికక్కడ చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి. మోరీల్లో చెత్త పేరుకపోయింది. వర్షాకాలం కావడంతో చెత్తాచెదారం, మురుగు కాలువల్లో దోమలు ఎక్కువై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో పల్లె ప్రగతి నిధుల వెల్లువ..
కేసీఆర్ హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాలు పల్లెప్రగతితో అభివృద్ధి సాధించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో గ్రామాలను అభివృద్ధి చేసింది. ఉమ్మడి జిల్లాకు సుమారుగా నెలకు రూ.30 కోట్ల పైచిలుకు నిధులు వచ్చాయి. ఆ నిధులతో గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతి ఊరికి డంపింగ్ యార్డు, హరితహారంలో విరివిగా మొక్కలు నాటించారు. తాగునీటి సమస్య లేకుండా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీటిని అందించారు. దీంతో జాతీయ, రాష్ట్రస్థాయిలో జిల్లాలోని పలు గ్రామా లు ఆవార్డులు సాధించాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి కుంటుపడింది.