మామిళ్లగూడెం, ఫిబ్రవరి 20: ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిబద్ధతతో నిర్వర్తించాలని, కొత్తగా నియమితులైన వారు జవాబుదారీతనంతో పనిచేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా రెవెన్యూశాఖలో ప్రమోషన్లు పొందిన 15 మందికి నియామక ఉత్తర్వుల పత్రాలను కలెక్టరేట్లో శుక్రవారం అందించారు. అదనపు కలెక్టర్ పీ.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్న సిబ్బంది..
విషయ పరిజ్ఞానాన్ని, విధుల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. డ్రాఫ్టింగ్, కంప్యూటర్ వినియోగంపై పట్టు సాధించాలని సూచించారు. నిరంతరం నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకోవాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, ప్రజలకు త్వరితగతిన పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని, నిబద్ధతతో విధులు నిర్వహించి ప్రజా సేవలో ముందుండాలని దిశానిర్దేశం చేశారు. ట్రెసా జిల్లా అధ్యక్షుడు సునీల్‌రెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమానికి జిల్లా యంత్రాం గం అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు.
ఉద్యోగోన్నతులు పొందిన వారిని పలువురు జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు. ముందుగా.. జిల్లా రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న 15 మంది నాలుగో తరగతి ఉద్యోగులు డ్రైవర్లు, రికార్డు అసిస్టెంట్ కేటగిరీ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు లభించిన సందర్భంగా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ట్రెసా జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ డివిజన్ల ప్రతినిధులు, కలెక్టరేట్ యూనిట్ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.