అశ్వారావుపేట, ఫిబ్రవరి 20 : ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి అప్పులపాలైన మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తూ మనోవేదనకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నేటికీ పైసా విడుదల చేయకపోవడంతో పెండింగ్ బిల్లులు అసలు వస్తాయా.. లేదా.. అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం అప్పులు చేసిన మాజీ సర్పంచులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసిన అప్పులు తీర్చే దారిలేక దిక్కులు చూస్తున్నారు. కొందరు ఆస్తులు అమ్ముకుని అప్పులు తీర్చి బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు.
నిధులు మంజూరు చేయాలని రేవంత్‌రెడ్డి సర్కార్‌ను వేడుకుంటున్నా ఎప్పుడు స్పందిస్తుందో అర్థంకాక అర్ధాకలితో అలమటిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 471 గ్రామ పంచాయతీలు ఉండగా.. రూ.కోట్లలో పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయి. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాట పట్టినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం రాలేదు. బిల్లులు చెల్లించే వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించొద్దని వేడుకున్నా పట్టించుకోకుండా ఎన్నికల ప్రక్రియను రేవంత్‌రెడ్డి సర్కార్ పూర్తిచేసింది. కొత్త పాలక వర్గాలు సైతం కొలువుదీరాయి. అయినా బిల్లుల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం పట్ల మాజీ సర్పంచులు గోస పడుతున్నారు.
గ్రామాల అభివృద్ధిలో శక్తికి మించి పనిచేసిన మాజీ సర్పంచులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. బిల్లుల కోసం పోరుబాట పట్టినా రేవంత్‌రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి సర్పంచులుగా ఎన్నికైన అనేక మంది మాజీలు ఇప్పుడు పెండింగ్ బిల్లులు అందక రెండేళ్లుగా అర్ధాకలితో అలమటిస్తున్నారు.

కొందరు సర్పంచులు ఆస్తులు అమ్ముకుని అప్పులు తీర్చారు. ఆస్తులులేని ఇంకెందరో అప్పుల ఊబి నుంచి బయటపడలేక పెండింగ్ బిల్లుల కోసం గోస పడుతున్నారు. బిల్లులు సాధించుకోవడం వారికి కత్తి మీద సాములా తయారైంది. ఒక్కో పంచాయతీలో సుమారు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నాయి.
మేజర్ పంచాయతీల్లో అయితే ఏకంగా రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు పైమాటే. అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ పనులు తమ ప్రభుత్వంలో జరగలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేసే ధోరణి అవలంబిస్తుందని మాజీ సర్పంచులు మండిపడుతున్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందే పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరినా పట్టించుకోకుండా రేవంత్‌రెడ్డి సర్కార్ ఎన్నికలకు వెళ్లిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త సర్పంచులు కొలువుదీరడంతో ఇప్పుడు గ్రామాల్లో రాజకీయాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు పోరుబాట పట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనికితోడు ఎక్కడికక్కడ అక్రమంగా నిర్బంధించి వారిని మరింత క్షోభకు గురిచేసింది. మాజీ సర్పంచులు గత రెండేళ్లుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై నిరసన గళం విప్పుతూనే ఉన్నారు. అయినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ పెడచెవిన పెట్టడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రజావాణిలో ఫిర్యాదులు చేసేందుకు వెళ్తున్న సందర్భంగా పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిస్తే అక్రమంగా అరెస్ట్‌లు చేశారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం దృష్ట్యా గత ఏడాది డిసెంబర్ 29న సర్పంచుల సంఘం ముట్టడికి పిలుపునివ్వడంతో అర్ధరాత్రి నిర్బంధించిన పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్ళారు. మరుసటిరోజు ఉదయం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. పెండింగ్ బిల్లులు వస్తేనే తప్ప తమ అప్పులు తీరవని స్పష్టం చేస్తున్నారు. బిల్లులు అందుకునే వరకు నిరంతరం రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని హెచ్చరిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా రూ.40 కోట్లకు పైగానే పెండింగ్ బిల్లులు ఉంటాయని మాజీ సర్పంచులు అంచనా వేస్తున్నారు. జిల్లాలోని 22 మండలాల్లో 471 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఒక్కో పంచాయతీకి సుమారు రూ.6 లక్షలు, మేజర్ పంచాయతీల్లో రూ.20 లక్షలకు పైనే పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఈ లెక్కన జిల్లా మొత్తం మీద సుమారు రూ.40 కోట్లకు పైగానే మాజీ సర్పంచులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో గత రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు నిలిచిపోయాయి. తాజాగా కొత్త పాలక వర్గాలు కొలువుదీరడంతో ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ నిధుల్లోనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే తప్ప మాజీ సర్పంచులకు బిల్లులు అందే పరిస్థితి లేదు. ప్రజల కోసం అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశామని, ప్రాధాన్యత దృష్ట్యా సమస్యలను పరిష్కరించామని, ఇందుకు నిధులు లేక అప్పులు చేయాల్సి వచ్చిందని మాజీలు స్పష్టం చేస్తున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం పెండింగ్ బిల్లులు ఇచ్చినా వాటి చెల్లింపునకే సరిపోతాయని చెబుతున్నారు. అసలు ఎలా ఉన్నా వడ్డీలు చెల్లించలేకే కుటుంబాల పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పులు పెరిగిపోవడంతో మాజీ సర్పంచుల కుటుంబాలు ఆర్థికంగా ఆగమైపోయాయి. గత రెండేళ్లుగా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లిస్తుందని ఎదురుచూస్తూనే ఉన్నాం. ఆందోళనలకు సిద్ధమైన సర్పంచులను పోలీసులతో అక్రమంగా నిర్బంధించి క్షోభకు గురిచేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తై కొత్త పాలక వర్గాలు కొలువుదీరినా ఇంకా పెండింగ్ బిల్లులు చెల్లించకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తున్నది. బిల్లులు చెల్లించే వరకు కాంగ్రెస్ సర్కార్‌పై పోరాటం కొనసాగిస్తాం.
– నారం రాజశేఖర్, మాజీ సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు, అశ్వారావుపేట
పంచాయతీ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం అప్పులు చేశాను. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకాక చేసిన అప్పులు వడ్డీలతో భారీగా పెరిగిపోవడంతో మూడెకరాల వ్యవసాయ భూమి అమ్ముకున్నాను. ఆ డబ్బుతోనే కొన్ని అప్పులు తీర్చాను. ఇంకా కొన్ని అప్పులు మిగిలే ఉన్నాయి. రెండోసారి సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం వచ్చినా కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వార్డు సభ్యుడిగా పోటీచేసి గెలిచాను. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలి.
– సోని శివశంకర్ ప్రసాద్, మాజీ సర్పంచ్, వేదాంతపురం