కామారెడ్డి, ఫిబ్రవరి 20: కాంగ్రెస్ నేతలకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో, శిశుమందిర్ పాఠశాల, అరోరా కాలేజ్ విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు తీసుకొని శనివారం శిశుమందిర్ పాఠశాలకు రావాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరముందన్న ఎమ్మెల్యే.. తాను కూడా వస్తానని, కాంగ్రెస్ నేతలతో పాటు కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు హాజరు కావాలని కోరారు. కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులంతా పాల్గొంటారని తెలిపారు. మరోవైపు, ఎమ్మెల్యే కాటిపల్లి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో చర్చకు తాము వస్తామని స్పష్టం చేశారు.