India : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో వాణిజ్య నౌకలపై దాడులను ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC) లో తీవ్రంగా ఖండించింది. హింసాత్మక ఘటనలు వెంటనే నిలిపివేసి, అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని పునరుద్ధరించాలని స్పష్టంచేసింది. పశ్చిమాసియా (West Asia) లో శాంతి, స్థిరత్వం సాధించేందుకు దౌత్య మార్గమే సరైనదని భారత్ పునరుద్ఘాటించింది.
ఐరాస భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ.. ఈ నెల హర్మూజ్ జలసంధిలో జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ ఏఐ బహియాహ్, ఎంటీ మొంబాసా నౌకలపై దాడులు జరిగాయన్నారు. ఈ దాడుల్లో పలువురు భారతీయులు గాయపడగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారన్నారు. మరో వ్యక్తి గల్లంతయ్యాడని ఆందోళన వ్యక్తంచేశారు. వాణిజ్య నౌకలు, పౌర మౌలిక వసతులపై దాడులు తక్షణమే ఆగాలన్నారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమన్నారు.
హూతీలు సముద్ర రవాణాపై కొనసాగిస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు. బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి, దక్షిణ ఎర్ర సముద్ర ప్రాంతంలో నౌకాయానాన్ని కాపాడటం ప్రపంచ దేశాల ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు.