న్యూయార్క్: రాబోయే నెలల్లో ప్రపంచం భారీ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నదని విదేశాంగ మంత్రి ఎన్ జైశంకర్ మంగళవారం హెచ్చరించారు. ఎరువుల కొరత, ధాన్యం రవాణాకు అంతరాయాలు, సూపర్ ఎల్ నినో ముప్పుతో పాటు ఉక్రెయిన్, గల్ఫ్‌లోని యుద్ధాలు గ్లోబల్ సౌత్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన అన్నారు. న్యూయార్క్‌లో ఆసియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, రెండు యుద్ధాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం చూపాయని చెప్పారు.
ముఖ్యంగా ఇంధనరంగంపై భారత్ ఆందోళనగా ఉందని, మార్కెట్ చాలా ఒత్తిడితో ఉందని పేర్కొన్నారు. చమురు సరఫరాలతో రాజకీయాలు ముడిపెడితే ధరలు పెరుగుతాయని జైశంకర్ అన్నారు. ఇది మరింత సమస్యకు దారి తీస్తున్నదని చెప్పారు.