తిరువనంతపురం, సెప్టెంబర్ 29: కేరళలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా కాకుండానే కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం పార్టీకి ప్రజలు షాక్ ఇచ్చారు. 38 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో అధికార యూడీఎఫ్ ఏడు సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. మొత్తంగా యూడీఎఫ్ 19, ఎల్డీఎఫ్ 18, ఎన్డీఏ ఒక స్థానంలో గెలుపొందాయి. విపక్ష ఎల్డీఎఫ్ గతంలో కంటే మూడు స్థానాలను అధికంగా గెల్చుకుంది.
పాలక్కాడ్ జిల్లాలోని చిట్టూరు మున్సిపాలిటీలో అధికార యూడీఎఫ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. యూడీఎఫ్‌కు చెందిన సుమేశ్ అచ్చుతన్ అసెంబ్లీకి ఎన్నిక కావడంతో జరిగిన ఎన్నికలో ఇక్కడ ఎల్డీఎఫ్ విజయం సాధించింది. త్రిక్కోడితానంలో కూడా ఎల్డీఎఫ్ అనూహ్య విజయాన్ని సాధించింది.
ఈ విజయాలతో అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఎల్డీఎఫ్ పుంజుకుంటున్నదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే యూడీఎఫ్ గెలిచిన పలు సీట్లలో కూడా ఓట్ల మార్జిన్ గణనీయంగా తగ్గడం మరో కోణాన్ని చూపిస్తున్నది. కోజికోడ్ కార్పొరేషన్లో కుట్టిచిరను గతంలో పెరంబాకు చెందిన ఐయూఎంఎల్ ఎమ్మెల్యే ఫాతిమా తాహ్లియా ప్రాతినిధ్యం వహించే వారు. కాగా, తమ సంస్థాగత, రాజకీయ పునరుద్ధరణ ప్రారంభమైందని ఎల్డీఎఫ్ భావిస్తున్నది.