న్యూఢిల్లీ: ఒక పక్క చేస్తున్న కోర్సుపై ఆందోళన, మరో పక్క చదువైన తర్వాత ఉద్యోగం వస్తుందో రాదో అన్న బెంగ.. ఈ కోర్సు పూర్తయిన తర్వాత మరో కోర్సు చేయాలా? వద్దా? చేస్తే ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయో అన్న గందరగోళంతో నేటి యువత తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. విద్యార్థుల్లో ఆత్మహత్యలు పెరిగిపోవడంతో, దానిని పరిశీలించడానికి సుప్రీంకోర్టు నియమించిన నేషనల్ టాస్క్ఫోర్స్ పరిశీలనలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఉన్నత విద్యా సంస్థల్లో గత ఏడాది కాలంలో ప్రతి 10 మందిలో ఒకరు ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నట్టు వీరి పరిశీలనలో తెలిసింది. గత ఆరు నెలల్లో దీర్ఘకాలిక క్షోభ, నిరాశ, ఆందోళన వంటి దశలను 15 శాతం మంది విద్యార్థులు ఆనుభవించినట్టు టాస్క్ఫోర్స్ తెలిపింది. 2.43 లక్షల మంది విద్యార్థులను సర్వే చేయగా, 34 శాతం మంది క్యాంపస్లో తమని తాము బయటి వ్యక్తులుగా భావించారు.