MLA Sudheer Reddy | హైదరాబాద్:హైడ్రా (Hydra) కమిషనర్‌గా రంగనాథ్‌ను తీసివేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శించారు. హైడ్రాకు అందమైన భాష్యం చెప్పి తమ ఇష్టాలకు అనుగుణంగా వాడుకుంటూ పెద్దల భూములు రక్షించుకుంటూ.. పేదల ఇండ్లు కూలగొడుతూ ఎంతో మందిని రోడ్డున పడేశారని అన్నారు. తెలంగాణ భవన్లో (Telangana Bhavan) బుధవారం ఆయన మీడియాకు ఈ విషయాలు వెల్లడించారు.
ప్రజలను మభ్యపెట్టడం కోసమే లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కాపాడినట్లు రంగనాథ్ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. దుర్గంచెరువు వద్ద ఉన్న నెక్టార్ గార్డెన్స్, ఫాతిమా కాలేజ్ లాంటి వాటి జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదని మండిపడ్డారు. హిమాయత్ సాగర్, గండిపేట ఎఫ్టీఎల్లో ఉన్న ఇండ్ల వద్దకు హైడ్రా ఎందుకు వెళ్లడం లేదని, కోర్టును తప్పుదోవ పట్టించారని విమర్శించారు. రంగనాథ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ కింద సుమోటోగా స్వీకరించాలని కోరారు.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి హైడ్రా కూడా ఒక కారణం అని పేర్కొన్నారు. హైడ్రాను బ్లాక్ మెయిలింగ్‌కు సాధనంగా వాడుకోవటం సబబు కాదని, సీఎం, మంత్రులు అబద్ధాలు మాని పరిపాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. కేసీఆర్, బీఆర్ఎస్లను తలచుకుంటే వారికి నిద్ర పట్టడం లేదని అన్నారు. పాలన చేయకుండా నిత్యం కేసీఆర్‌ను తిట్టుకుంటూ ఎన్నాళ్లు పబ్బం గడుపుతారని వెల్లడించారు.