బీబీనగర్, జూలై 29 : ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చని బీబీనగర్ మండల వ్యవసాయ అధికారి పద్మ అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని రైతు వేదికలో బుధవారం ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత వానాకాలం సీజన్లో బీబీనగర్ మండలంలో ఇప్పటికే 80 శాతం వర్షపాతం లోటు నమోదైందన్నారు. అనిశ్చిత వర్షపాతం, నీటి లభ్యత తగ్గిన నేపథ్యంలో అధిక నీరు అవసరమయ్యే వరి సాగును నివారించాలని రైతులకు సూచించారు.
దానికి బదులుగా కందులు, మినుము, మొక్కజొన్న, ఆయిల్ పామ్, కూరగాయలు వంటి తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. దీంతో పంట నష్టాలను తగ్గించడంతో పాటు ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మెరుగైన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని వివరించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవడం అవసరమని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి మాధవి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.