రాయపోల్, పిబ్రవరి 20: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు నిర్మించి కాల్వల ద్వారా సాగు నీళ్లు ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం కాల్వలో కనీసం పూడిక తీయడం లేదని, దీంతో రైతులు సాగునీళ్ల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని మంతూర్-అనాజీపూర్ గ్రామాల శివారులోని 13 డీకాల్వలో గోదావరి జలాలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి శుక్రవారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు, ప్రధాన కాల్వలు నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కాల్వలో పూడిక తీయడం లేదని విమర్శించారు. నీళ్లు వస్తాయనే ఆశతో రైతులు పంటలు సాగు చేసుకుంటే కాల్వనిండా పూడిక ఉండటంతో రైతులే ముందుకువచ్చి తీసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రెండున్నర ఏండ్లుగా సిద్దిపేట జిల్లా సాగునీటి సమస్యలపై సమీక్ష నిర్వహించని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తమంత్రిగా మిగిలిపోయాడన్నారు. రెండేండ్లుగా ఉప కాల్వలు నిర్మించాలని అసెంబ్లీ సాక్షిగా గళమెత్తినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
దుబ్బాక అంటేనే వ్యవసాయ నియోజకవర్గమని, ఇక్కడ ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉప కాల్వల నిర్మాణం కోసం భూ సేకరణ, పరిహారం, నిర్మాణంపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్, రాయపోల్, తొగుట, మిరుదొడ్డి, చేగుంట మండలాలకు కాల్వల ద్వారానే నీరు వెళ్తుందన్నారు. ప్రధాన కాల్వలో పూడిక పనులు,ఉప కాల్వలను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని, లేని పక్షంలో నియోజకవర్గంలోని రైతులతో ఉద్యమిస్తామన్నారు.
కాగా దౌత్తాబాద్, రాయపోల్, మిరుదొడ్డి మండలాలకు చెందిన రైతులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంతూర్ సర్పంచ్ పర్వేజ్ అహ్మద్, అనాజీపూర్ సర్పంచ్ నిర్మలాఇస్తారి, గాజులపల్లి సర్పంచ్ పంజ స్వామి, దొమ్మట మాజీ సర్పంచ్ పూజితా వెంకట్‌రెడ్డి, ఇరిగేషన్ డీఈ దీప్త్తి, ఏఈ సుమన్, ఇంజినీర్ సందీప్, బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు రణం శ్రీనివాస్‌గౌడ్, నాయకులు ఇప్ప దయాకర్, లింగం, తొట కమాలకర్రెడ్డి, భార్గవ్, కృష్ణారెడ్డి, గాజులపల్లి మాజీ సర్పంచ్ బోలి చంద్రం, వివిధ గ్రామాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.