సిద్దిపేట అర్బన్: కేవలం వరి పంట మాత్రమే కాకుండా రైతులు వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎంలు సత్యనారాయణ పాణిగ్రహి, నటరాజన్ అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో ఎస్బీఐ బ్యాంకు ఆధ్వర్యంలో ప్రగతి శీల రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రైతులకు బ్యాంకుల ద్వారా ఏయే వసతులు పొందవచ్చునో ఎలాంటి పంటలు వేస్తే రైతులకు లాభం జరుగుతుందో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీజీఎం మాట్లాడుతూ రైతులు ఎక్కువగా వరి పంట వేయడానికి ఆసక్తి చూపుతున్నారని అది కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలన్నారు.
రైతులకు వాణిజ్య పంటలకు సంబంధించి అన్ని రకాల సబ్సిడీలు, లోన్లు అందిచడం జరుగుతుందన్నారు. ఇంతకుముందు అప్పులు ఉన్న రైతులు వాటిని రెన్యూవల్ చేసుకోవాల ని తద్వారా ఇతర చిన్న సన్నకారు రైతులకు అప్పులు ఇవ్వడానికి వీలుంటందన్నారు. వాణిజ్య పంటలు సాగు చేయడం ద్వారా రైతుల ఆర్థిక అభివృద్దితో పాటు దేశ ఆర్థికాభివృద్ది మెరుగుపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్బీఐ ఆర్ఎం ప్రియకుమార్ మాట్లాడుతూ బ్యాంకు లోన్స్ గురించి రైతులకు సిబ్బంది చక్కగా వివరించాలని తద్వారా రైతులు లోన్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారన్నారు.
ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ప్రత్యామ్నాయ వాణిజ్య పంటల గురించి వాటికి సంబంధించిన లోన్ అవకాశాల గురించి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ ఏజీఎం సుషీల్ కుమర్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, జిల్లా హార్టికల్చర్ అధికారి రామలక్ష్మి, ఎల్ఎండీ ప్రసాద్, చీఫ్ మేనేజర్ శేషగిరి రావు, బ్రాంచ్ మేనేజర్లు శ్రీనివాస్, రవీంద్రనాథ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.