Farmers | మిరుదొడ్డి, జూన్ 19 : రైతులు ఆరు గాలం కష్టపడి పండించి విక్రయించిన పొద్దు తిరుగుడు ధాన్యం డబ్బులను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తూ రైతులను మోసం చేసిందని తొగుట సొసైటీ చైర్మన్ కే హరికృష్టారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి అన్నారు.
పొద్దు తిరుగుడు ధాన్యాన్ని విక్రయించి 75 రోజులు గడుస్తున్నా నేటికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో ఆగ్రహానికి లోనైన రైతులు గురువారం తొగుట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రైతులు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పొద్దు తిరుగుడు సెంటర్ను ప్రారంభించినప్పటి నుంచి ధాన్యం కొనుగోలు చేసే దాకా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులను సృష్టించిందని పేర్కొన్నారు. తొగుట సెంటర్ పరిధిలో 400 మంది రైతులకుగాను రూ.3 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు అంటే రైతులు ధాన్యం అమ్మిన డబ్బుల కోసం రోడ్ల మీదికి రావడమేనా.. ? అంటూ ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రైతులను మభ్య పెట్టడానికి చూస్తుందన్నారు. బకాయిలు పడిన పొద్దు తిరుగుడు రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్నపోలీసులు రైతులను సముదాయించడంతో ఆందోళన విరమించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ యాదగిరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమురయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మల్లారెడ్డి, నాయకులు నర్సింహులు, వెంకట్రెడ్డి, బాగిరెడ్డి, అశోక్, రాములు, స్వామి గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Bonakal : ‘కాంగ్రెస్ నాయకుల నుండి రక్షించండి’
GHMC | ఇదేనా స్వచ్చ సర్వేక్షన్ స్పూర్తి.. చెత్త తరలింపులో బల్డియా నిర్లక్ష్యం
Banjarahills | వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేదానికి తూట్లు.. కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి పనులు