బోనకల్లు, జూన్ 19 : కాంగ్రెస్ నాయకుల దాడుల నుండి రక్షించాల్సిందిగా కోరుతూ బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామ కార్యకర్తలు, పలువురు మహిళలు బోనకల్లు పోలీసులను గురువారం ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నాయి. వారం రోజుల క్రితం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మడుపల్లి వెంకటేశ్వర్లు ఆటోలో ప్రయాణిస్తుండగా ఇదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పెద్దప్రోలు సైదులు అతడి కుమారుడు కార్తీక్ లు ఆటోను ఆపి వెంకటేశ్వర్లుపై ఇనుపరాడ్డుతో దాడి చేశారు. ఈ దాడిలో వెంకటేశ్వర్లు తీవ్ర గాయాలపాలై అపస్మాక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు అడ్డుకోవడంతో ప్రాణపాయం తప్పింది. ఈ విషయంపై ప్రశ్నించిన వెంకటేశ్వర్లు తల్లి రాధమ్మపై కూడా వారు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సైదులు, అతడి కుమారుడు కార్తీక్ ఆగడాలపై స్థానిక కాంగ్రెస్ నేతలకు తెలియజేశారు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉండటం వల్ల వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించలేదని బాధితులు వాపోయారు. బుధవారం గ్రామం నుంచి పెద్ద ఎత్తున మహిళలు, బాధిత కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులతో ప్రాణభయం ఉందని, వారి నుంచి కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ మొగిలి వెంకన్న జరిగిన సంఘటనపై విచారించారు. పెద్దప్రోలు సైదులు, కార్తీక్‌తో ప్రాణ భయం ఉందని ఎస్ఐకు తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేపడతానని, దౌర్జన్యాలకు దిగి దాడులు చేస్తే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, బ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్ జెర్రిపోతుల రవీందర్, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు వంగాల కృష్ణ, మాజీ ఎంపీటీసీ వంగాల సీత, బీఆర్ఎస్ నాయకులు రామిశెట్టి రవికుమార్, గుడిద శ్రీరామ్, మడుపల్లి రాములు, రాధమ్మ, మడుపల్లి చిన్న కృష్ణ, బూడిద లక్ష్మణ్, వెంకటకృష్ణ, వంగాల గోపి, ఎనమద్ది శ్రీనివాసరావు పాల్గొన్నారు.