Deccan Cements | అక్రమాలు, ఆక్రమణల క్రమబద్ధీకరణ.. డెక్కన్ సిమెంట్స్ ఎపిసోడ్లో నాటకీయ పరిణామాలు
‘స్వయానా ముఖ్యమంత్రి ప్రధాన అనుచరుడు డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించారు...’ ఇదీ ఇటీవల మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితాపటేల్ చేసిన సంచలన ఆరోపణ. అయితే, ఈ బెదిరింపుల వ్యవహారం ఎక్కడిదాకా వచ్చిం ది? కథ సుఖాంతమైందా? రాష్ట్ర ప్రజల్లో కలిగే సందేహమిది.
- సర్కార్ పెద్దల కనుసన్నల్లో అండగా నిలుస్తున్న అటవీ శాఖ
- గతంలోనూ ఆక్రమణపై ఒక్కో అధికారి ఒక్కోలా నివేదికలు
- కేంద్ర సాధికారత కమిటీ రంగంలోకి దిగినా మారని తీరు
- క్రమబద్ధీకరించారు కదా… అంటూ అధికారుల్లో తేలిక భావన
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : ‘స్వయానా ముఖ్యమంత్రి ప్రధాన అనుచరుడు డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించారు…’ ఇదీ ఇటీవల మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితాపటేల్ చేసిన సంచలన ఆరోపణ. అయితే, ఈ బెదిరింపుల వ్యవహారం ఎక్కడిదాకా వచ్చిం ది? కథ సుఖాంతమైందా? రాష్ట్ర ప్రజల్లో కలిగే సందేహమిది. కానీ, డెక్కన్ సిమెంట్స్ ఎపిసోడ్ ఇప్పుడు కోడి ముందా..? గుడ్డు ముందా..? అనే సందేహాన్ని లేవెనెత్తే స్థాయికి వచ్చినట్టుగా గత కొన్నిరోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో స్పష్టమవుతున్నది. ఆదినుంచీ డెక్కన్ సిమెంట్స్ అటవీ భూముల ఆక్రమణలో కొమ్ముకాస్తూ వస్తున్న అటవీ శాఖ అధికారులు చివరకు వ్యవహారాన్ని అసలు సైదుల్నామా రిజర్వు ఫారెస్టులో డెక్కన్ సిమెంట్స్ ఆక్రమణలు ముందు జరిగాయా? కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ క్రమబద్ధీకరణ ముందు జరిగిందా? అనే డైలమాలో పడేశారు. కేంద్ర సాధికారత కమిటీ రంగంలోకి దిగి విచారణకు ఆదేశించినా అధికారులు మాత్రం సదరు కార్పొరేట్ కంపెనీని బయటపడేసేందుకు నానా తంటాలు పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్కార్ పెద్దల కనుసన్నల్లోనే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
డెక్కన్ సిమెంట్స్‌పై అభియోగాలు
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలానికి సమీపంలో ఉన్న సైదుల్నామా రిజర్వు ఫారెస్టులో సున్నపురాయి నిక్షేపాలను తవ్వి తమ సిమెంటు పరిశ్రమకు వినియోగించుకునేందుకు ఆయా ప్రభుత్వాలు డెక్కన్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి 1987 నుంచి మూడు దఫాలుగా అనుమతులు ఇచ్చాయి. 2011లో కంపార్టుమెంటు-26లో 1.933 హెక్టార్లలో రైల్వే ట్రాక్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సదరు కంపెనీ తమకు కేటాయించిన అటవీ భూమిలో కాకుండా అదనంగా కంపార్టుమెంటు-26,27లోని భూమిలోకి ప్రవేశించి తమ కార్యకలాపాలను విస్తరించిందని ప్రధాన అభియోగం. దీనిపై వీ కోటేశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ చేసి నివేదిక ఇచ్చారు. 2020లోనే అప్పటి ఖమ్మం సర్కిల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు నివేదిక ప్రకారం… డెక్కన్ సిమెంట్స్ ఎలాంటి అనుమతులు లేకుండా కంపార్టుమెంటు-26లో 10.12 హెక్టార్లు, కంపార్టుమెంటు-27లో 21.51 ఎకరాలు మొత్తంగా 31.62 హెక్టార్లలో గేటుతో కూడిన ప్రహరీ, రైల్వే ప్లాట్‌ఫాం, అధికారులు, ఉద్యోగుల క్వార్టర్లు, పెట్రోలు బంక్, గెస్ట్‌హౌస్, రోడ్లు వంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టారనే విషయం ఖమ్మం ఫారెస్టు డివిజనల్ ఆఫీసర్ (ఫ్లయింగ్ స్కాడ్ విభాగం) క్షేత్రస్థాయిలో విచారణలో తేలింది.
తదనంతరం సూర్యాపేట జిల్లా అటవీ శాఖాధికారి విచారణలో 8.02 హెక్టార్లలో ఆక్రమణలు ఉన్నాయని తేల్చగా… డెక్కన్ సిమెంట్స్ వారు కూడా ఇంతే విస్తీర్ణంలో ఆక్రమణలు జరిగాయని అంగీకరించారు. తప్పు జరిగిందని తేల్చిన అధికారులు అటు పిమ్మట చర్యలు తీసుకోవాలి. కానీ, ఆ తప్పును ఒప్పుగా మభ్యపెట్టేందుకు కంకణం కట్టుకున్నారు. డెక్కన్ సిమెంట్స్ ఆక్రమించిన అటవీ భూమికి క్రమబద్ధీకరణ ముసుగు తొడిగేందుకు అన్నిరకాలుగా సహకరించారు. కేవలం నాలుగు రోజుల్లోనే డెక్కన్ సిమెంట్స్ చేసుకున్న క్రమబద్ధీకరణ దస్ర్తాన్ని తొమ్మిది దశలను దాటించి స్టేజ్-1 అనుమతులు వచ్చేలా చేశారు. దీనిపై మరో ఫిర్యాదుతో రావడంతో చివరకు వ్యవహారం న్యాయస్థానాలు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలోకి వెళ్లింది. స్టేజ్-2 అనుమతుల తర్వాత సరైన సంస్థలను ఆశ్రయించాల్సిందిగా ఫిర్యాదుదారుడికి ఎన్జీటీ సూచించింది. చివరకు 2023 చివరలో స్టేజ్-2 అనుమతులు వచ్చాయి. అప్పటి నుంచి డెక్కన్ సిమెంట్స్ ఆక్రమణల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.
చట్టాలు… న్యాయస్థానాలూ బలాదూర్!
డెక్కన్ సిమెంట్స్ అనుమతులు లేకుండా 8.02 హెక్టార్ల అటవీ భూములను ఆక్రమించిందనేది ఆ కంపెనీతోపాటు అటవీ శాఖ అధికారులు తేల్చిన వాస్తవం. ఈ నేపథ్యంలో ఎన్జీటీ సూచనతో స్టేజ్-2 అనుమతుల తర్వాత వచ్చిన ఫిర్యాదులపై అటవీ శాఖ చట్టాలు, నిబంధనల మేరకు వ్యవహరించాల్సి ఉన్నది. కానీ ఇక్కడే ఈ వ్యవహారం సర్కార్ పెద్దల దాకా వెళ్లిందని సమాచారం. ఎందుకంటే, అటవీ ఆక్రమణలు తేలినపుడు సంబంధిత రాష్ట్ర అటవీ శాఖ ఏం చేయాలనే దానిపై కేంద్ర చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులు, ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ, దురదృష్టవశాత్తు తెలంగాణ అటవీ శాఖ డెక్కన్ సిమెంట్స్ విషయంలోనే కాదు… కంచె గచ్చిబౌలి భూముల వంటి విషయాల్లోనూ ఈ చట్టాలను గౌరవించి, అమలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. 1980 అటవీ సంరక్షణ చట్టంపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ 18.9.1990న దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన మార్గదర్శకాలు పంపింది. అందులో భాగంగా అటవీ భూముల ఆక్రమణ క్రమబద్ధీకరణపై సమగ్రమైన మార్గదర్శకాలను పొందుపరిచింది. 1980 కంటే ముందు జరిగిన ఆక్రమణలు మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హమైనవిగా ఉంటాయని పేర్కొంటూనే… వాటిల్లోనూ ఎలాంటివి క్రమబద్ధీకరించవద్దో కూడా స్పష్టం చేసింది.
ఇదే మంత్రిత్వ శాఖ 3.5.2002న పంపిన మార్గదర్శకాల్లోనూ ప్రత్యేక హెచ్చరికలు సూచించింది. అటవీ ఆక్రమణలు అనేవి సాధారణ వ్యక్తుల నుంచి జరిగేవి స్వల్పంగా ఉంటాయని, ప్రధానంగా పవర్ఫుల్ లాబీస్ (అధికార, అంగ బలమున్న కార్పొరేట్ శక్తులు) నుంచి జరిగే ఆక్రమణలు అటవీ పరిరక్షణకు తేనెపూసిన బాంబుల్లా మారుతాయని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం గత చట్టాలు, మార్గదర్శకాలు, అనుభవాలను క్రోడీకరించి 2023లో తీసుకొచ్చిన వన్ (సంరక్షణ్ ఇవమ్ సంవర్ధన్) నిబంధనలు-2023లోనూ ఎలాంటి ఆక్రమణలు క్రమబద్ధీకరించాలి… ఎలాంటివి క్రమబద్ధీకరించవద్దనే మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. సుప్రీంకోర్టు సైతం టీఎన్ గోదావర్మన్ తిరుమల్పాడ్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం, నేచురల్ లవర్స్ మూవ్మెంట్ వర్సెస్ కేరళ ప్రభుత్వం తీర్పుల్లోనూ అటవీ ఆక్రమణల క్రమబద్ధీకరణపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే పైచట్టాలు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ డెక్కన్ సిమెంట్స్ ఆక్రమణల క్రమబద్ధీకరణకు అర్హమైనవి కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఒకసారి ఆక్రమణలు తేలినపుడు వెంటనే సంబంధిత భూములను రాష్ట్ర ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు అటవీ శాఖ తగిన చర్యలు తీసుకోవాలి. కానీ గత కొన్నేండ్లుగా అధికారులు ఆ పని చేయకపోగా… డెక్కన్ సిమెంట్స్‌ను రక్షించారనే ఆరోపణలు ఉన్నాయి.
తుపాకీ ఎపిసోడ్‌తోనే వెలుగులోకి..
డెక్కన్ సిమెంట్స్ అనుమతులు లేకుండా అటవీ భూములను ఆక్రమించి శాశ్వత నిర్మాణాలను చేపట్టారనేది ఆ కంపెనీ ఒప్పుకోవడంతోపాటు అటవీ శాఖ అధికారుల విచారణల్లో కూడా తేలింది. అయితే, ఎన్జీటీ ఆదేశంతో స్టేజ్-2 అనుమతులు ఇచ్చిన తర్వాత ఫిర్యాదులు వచ్చినప్పటికీ అటవీ శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదనేది కీలకాంశం. ఈ క్రమంలో కొంతకాలం కిందట స్వయానా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యంపై ముఖ్యమంత్రి ప్రధాన అనుచరుడు తుపాకీ గురిపెట్టారనే సంచలన ఆరోపణ చేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు ఎందుకు మౌనం వహిచారనే సందేహాలకు తెర పడినట్టయ్యింది. అంటే వ్యవహారంలోకి ప్రభుత్వ పెద్దలు వచ్చారని స్పష్టమైంది. పైగా డెక్కన్ సిమెంట్స్ ఆక్రమణలపైనా ఎలాంటి చర్యలు లేకపోవడం కూడా వీటికి మరింత బలాన్ని చేకూర్చింది. కానీ, అనూహ్యంగా సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) కోర్టులోకి బంతి వెళ్లింది. అయినప్పటికీ అధికారుల తీరు మాత్రం మారడంలేదనే విమర్శలున్నాయి. ఎందుకంటే, సీఈసీ ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీన అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు.
దీనిపై ‘నమస్తే తెలంగాణ’ సూర్యాపేట డీఎఫ్‌వోను సంప్రదించగా… 8.02 హెక్టార్లలో రైల్వే ట్రాక్ ఉందనేది అందరికీ తెలిసినదే కదా… పైగా క్రమబద్ధీకరణ అనుమతులు కూడా వచ్చాయని అభిప్రాయపడ్డారు. దీంతో ఇక్కడ రెండు కీలకమైన అంశాలు తెరపైకి వచ్చాయి. డెక్కన్ సిమెంట్స్ 2020, అక్టోబర్ 1న అప్పటి సూర్యాపేట డీఎఫ్‌వోకు రాసిన లేఖలో 8.02 హెక్టార్లలో షెడ్లు, పవర్ ప్లాంటు, రైల్వేలైను ఉన్నదని, కాకపోతే అనుమతిలేని అటవీ భూముల్లో ఇలాంటి శాశ్వత నిర్మాణాలు తమకు తెలియనే తెలియదని పేర్కొన్నారు. కానీ తాజాగా అధికారులు మాత్రం 8.02 హెక్టార్లలో కేవలం రైల్వే లైను మాత్రమే ఉన్నదని స్పష్టం చేస్తుండటం గమనార్హం. రెండో కీలకమైన అంశం… 8.02 హెక్టార్ల క్రమబద్ధీకరణకు అనుమతులు వచ్చాయి కదా అని అధికారులు చెబుతున్నారంటే బారాఖూన్ మాఫీయేనా? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్ర చట్టాలు, సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అటవీ భూములను ఆక్రమించి శాశ్వత నిర్మాణాలు చేపడితే ఎలాంటి చర్యలు ఉండవా? అనే ఆందోళన వ్యక్తమవుతున్నది. అందుకే డెక్కన్ సిమెంట్స్ ఆక్రమణలు ముందా? క్రమబద్ధీకరణ అనుమతులు ముందా? అనేది తేలాల్సి ఉన్నది. దీంతో కేంద్ర సాధికారత కమిటీ తదుపరి అడుగులతోనే ఈ ప్రశ్నలకు సమాధానం వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

