హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : 2026-27 రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ముందస్తు బడ్జెట్ సమావేశాల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన శాఖల భవిష్యత్తును నిర్ణయించే ఈ సమీక్షలు నామమాత్రంగా సాగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార నేతృత్వంలో గురువారం జరిగిన సమీక్ష సమావేశాల్లో ఏకంగా 7 కీలక శాఖల ప్రతిపాదనలపై చర్చించారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశాలు రాత్రి 7 గంటలకే ముగిశాయి. అంటే కేవలం మూడున్నర గంటల వ్యవధిలోనే 7 శాఖలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు, ప్రతిపాదనలు ముగించడం గమనార్హం. ప్రతి శాఖకు సగటున 30 నిమిషాల సమయమే కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఉద యం 11 గంటలకు వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖలపై మం త్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి భట్టి విక్రమార సమీక్ష నిర్వహించనున్నారు. రైతాంగ సమస్యలు, రుణమాఫీ వంటి కీలక అంశాలు ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి కూడా కేవలం అరగంట సమయమే కేటాయించడం గమనార్హం. ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు శాఖల వారీగా ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని షెడ్యూల్ జారీచేశారు. ఇందులో ఫిబ్రవరి 18న ఒక్క సమావేశం, ఒక్కశాఖపై మినహా సమీక్షలేవీ జరుగలేదు. ఈనెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హడావుడిగా సమీక్ష నిర్వహించారు.
