GHMC | బంజారాహిల్స్, జూన్ 19 : హైదరాబాద్ నగరాన్ని స్వచ్చ సర్వేక్షన్లో అగ్రభాగంలో నిలిపేలా పనిచేయాలంటూ అధికారులు ప్రకటనలు జారీ చేస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం శానిటేషన్ విభాగం సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని జూబ్లీహిల్స్ కార్పోరేటర్ వెల్దండ వెంకటేష్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ పరిధిలోని పలు బస్తీల్లో చెత్త తరలింపులో జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఫిర్యాదులు అందుకున్న కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ గురువారం పర్యటించారు.
పలు ప్రాంతాల్లో రోడ్లపక్కన భారీగా చెత్తకుప్పలు కనిపించడంతో తీవ్రంగా స్పందించిన కార్పొరేటర్ వెంకటేష్ జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం అధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్చతలో మంచి ర్యాంకు పొందాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు ఒకవైపు ప్రత్యేకంగా కార్యక్రమాలు చేస్తుంటే రోజువారీ చెత్తను తొలగించడంలో ఇంత నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నించారు. పక్కనున్న షేక్‌పేట డివిజన్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగిస్తుంటే జూబ్లీహిల్స్ డివిజన్లోని ఫిలింనగర్లో మాత్రం పరిస్థితి దారుణంగా తయారైందని ఆసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలంలో ఇదే విధంగా వ్యవహరిస్తే అనేక రోగాలు వస్తాయని, దీనికి జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.