సిద్దిపేట, మార్చి 18: సాగునీరు(Irrigation water) అందక తమ పంటలు ఎండిపోతున్నాయని వెంటనే రంగనాయక సాగర్ నుండి తమకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన రైతులు సిద్దిపేట -కామారెడ్డి రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రంగనాయక సాగర్ నుంచి నీరు వచ్చే కెనాల్ నుండి కోదండరావుపల్లి, బంజేరవెల్లి వైపు నీటిని విడుదల చేయడంతో తమకు సాగునీరు అందక తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే పలుమార్లు ఈ విషయమై ఇరిగేషన్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వారు పట్టించుకోవడంలేదని వాపోయారు. వెంటనే తమకు నీటిని విడుదల చేసి తమ పంటలను ఎండిపోకుండా కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాస్తారోకో చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న సిద్దిపేట రూరల్ పోలీసులు రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.