Bridges | రాయపోల్, ఏప్రిల్ 12 : సాగునీటి సరఫరా కోసం అధికారులు కాలువను తవ్వించారు. కానీ ప్రజలు కాలువ దాటేందుకు వంతెనలు నిర్మించడం మాత్రం మరిచారు. దీంతో అటు వైపు వెళ్లేవారు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. వివరాల్లోకి వెళితే.. కొండ పోచమ్మ సాగర్ నుంచి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామానికి సాగు నీటిని సరఫరా చేసేందుకు దౌల్తాబాద్ మండలం అప్పాయపల్లి మీదుగా కాలువను నిర్మించారు. అప్పాయపల్లి గ్రామానికి చెందిన పలువురి రైతుల పొలాలు కాలువ అవతలి వైపు ఉన్నాయి. ఆ పొలాలకు వెళ్లేందుకు గతంలో దారి ఉండేది.
కాలువ నిర్మాణం పూర్తవడంతో రైతులు వారి పొలాలకు వెళ్లేందుకు తీవ్ర అడ్డంకి ఏర్పడింది. కాలువ నిర్మాణ సమయంలో పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులు, కాంట్రాక్టర్‌కు గ్రామస్తులు విన్నవించారు. కాలువపైన అవసరమైన చోట బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తామని అధికారులు, కాంట్రాక్టర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కానీ కాలువ నిర్మాణం పూర్తి చేసి వంతెనలు నిర్మించకుండానే వదిలేశారు. దీంతో ప్రతీ రోజూ పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు ఓ వైపు నుండి కాలువలోకి దిగి మరో వైపు నుండి ఎక్కి వెళ్లాల్సి వచ్చింది. వారంతా ప్రతిరోజు సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చేతగాని వారి పరిస్థితి అగమ్యగోచరం..
ఈ దారి వెంబడి పొలాల వద్దకు వెళ్లే వృద్దులు, చేతగాని వారి పరిస్థితి దుర్భరంగా మారింది. యువకులు మోసుకెళ్తే గానీ కాలువ దాటే పరిస్థితి లేకుండా పోయింది. వీరు యువకులను బతిమాలి కాలువ ఆవలి వైపు వెళ్లాల్సి వస్తున్నది. అధికారులు వెంటనే స్పందించి కాలువపై అవసరమైన చోట వంతెనలు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Ramakrishna Math | రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణా శిబిరాలు
padi koushik reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
Mutton | మటన్‌ను ఎంత మోతాదులో తింటే మంచిది..? ఈ లిమిట్ దాటితే కష్టమే..!