Mutton | సాధారణంగా చాలా మంది నాన్ వెజ్ ప్రియులకు మటన్ అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. చికెన్ కన్నా మటన్ ను తినాలంటేనే చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే తరచూ కాకపోయినా అప్పుడప్పుడు మటన్ తెచ్చుకుని తింటుంటారు. స్థోమత కలిగిన వారు నిరంతరం మటన్‌ను తింటూనే ఉంటారు. అయితే మటన్‌ను తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగే మాట వాస్తవమే అయినప్పటికీ, ఏ ఆహారాన్ని కూడా అతిగా తినకూడదు అన్న చందంగా.. మటన్‌ను కూడా మరీ అతిగా తినకూడదు. తింటే లేని పోని అనారోగ్య సమస్యలు వస్తాయి. మటన్‌ను అసలు ఎవరైనా వారానికి ఎంతో మోతాదులో తినాలి..? ఎంత మేర మటన్‌ను తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్‌లో కొవ్వులు అధికంగా ఉంటాయి. కాబట్టి దీన్ని మోతాదులోనే తినాలి. ఆరోగ్యవంతమైన వ్యక్తులు వారానికి సుమారుగా 300 గ్రాముల వరకు మటన్‌ను తినవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అదే శారీరక శ్రమ చేసేవారు, వ్యాయామం చేసేవారు అయితే వారానికి 500 గ్రాముల మేర మటన్‌ను తినాలని వారు సూచిస్తున్నారు. ఇక గుండె జబ్బులు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటివి ఉన్నవారు వారంలో 100 గ్రాములకు మించి మటన్ ను తినకూడదని వారు అంటున్నారు. మటన్‌ను బాగా ఉడికించి తినాలని వారు సూచిస్తున్నారు. దీంతో సులభంగా జీర్ణం అవుతుంది. అందులో ఉండే పోషకాలను మన శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. అలాగే వ్యాధులు రాకుండా ఉంటాయి. మటన్‌ను ఉడికించకుండా తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొందరికి అజీర్తి ఏర్పడి విరేచనాలు సంభవించే ప్రమాదం ఉంటుంది. కనుక మటన్‌ను ఉడికించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఇక మటన్‌ను తినడం వల్ల మన శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా మటన్ లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. అయితే విటమిన్ బి12ను పొందాలని చూసేవారు మటన్ లివర్, బోటి, తలకాయ వంటివి తినాలి. మటన్ కన్నా వీటిల్లోనే విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. విటమిన్ బి12 మన శరరీంలో ఎర్ర రక్త కణాల తయారీకి ఉపయోగపడుతుంది. అలాగే నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మెడ, భుజాల నొప్పి ఉన్నవారు తరచూ మటన్‌ను తింటే మేలు జరుగుతుంది. మటన్‌లో ఐరన్ కూడా సమృద్ధిగానే ఉంటుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. నీరసం, అలసట తగ్గుతాయి. యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు.
మటన్‌లో ఉండే జింక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శిరోజాలు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు చివర్లు లేదా గోర్లు చిట్లిపోతున్న వారు మటన్‌ను తింటుంటే మేలు జరుగుతుంది. అలాగే చర్మం కూడా సురక్షితంగా ఉంటుంది. మటన్‌లో ఉండే జింక్ పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. మటన్‌ను తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు మెరుగు పడి చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కణాలు రక్షించబడతాయి. మటన్‌ను తింటే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి కండరాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. శారీరక శ్రమ చేసేవారు లేదా వ్యాయామం చేసేవారు మటన్‌ను తింటే కండరాల దృఢత్వం పెరుగుతుంది. కండరాలు నిర్మాణం అవుతాయి. ఇలా మటన్‌ను వారం వారం మోతాదులో తింటుంటే లాభాలను పొందవచ్చు.