రాయపోల్ ఆగస్టు 21 : యూరియా కోసం ఆరు రోజులుగా ఎదురుచూస్తున్న రైతులకు మళ్లీ నిరాశే ఎదురైంది. శుక్రవారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి లారీ యూరియా లోడ్ మాత్రమే రావడంతో ఉదయమే అక్కడికి చేరుకున్న రైతులు తీవ్ర నిరాశ చెందారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఆరు రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నామని, ఇప్పుడు ఒక్క లోడ్ రావడంతో అది ఎవరికి పంపిణీ చేస్తారని ప్రశ్నించారు.
మొక్కజొన్న, పత్తి, వరి పంటలకు ఇప్పుడు యూరియా వేయకుంటే దిగుబడులపై ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అవసరాలకు అనుగుణంగా యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియా లోడ్ రావడంతో దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయం వద్ద టోకెన్ల కోసం రైతాంగం నానా ఇబ్బందులు పడ్డారు. ఒక్క రైతుకు రెండు బస్తాలు ఇవ్వడం వలన తమకు ఎలా సరిపోతుందని రైతులు ప్రశ్నించారు.
రైతు వేదిక కార్యాలయంలో టోకెన్లు ఇస్తే సొసైటీలో యూరియా ఇస్తున్నారని అక్కడికి ఇక్కడికి కిలోమీటర్ పొడవున నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వల్లే రైతులకు కావాల్సిన యూరియా అందడం లేదని ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయాలని మండలంలోని పలు గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. యూరియా దొరకకపోవడంతో చాలామంది రైతులు స్వగ్రామలకు నిరాశగా వెళ్లిపోయారు.