రాయపోల్.మార్చి 16 : పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలంన కష్టపడి చేతికి వచ్చిన ధాన్యం దళారుల పాలు అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంట సాగు చేయగా రాత్రింబవళ్లు కోతులు, పందుల కావలి ఉంటూ పంట పండించామని, వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాలపై ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాయపోల్ మండల పరిధిలోని 19 గ్రామ పంచాయతీ పరిధిలో ఈ సంవత్సరం 1300 వందలకు పైగా రైతులు ఆరు తడి పంటలో భాగంగా పొద్దుతిరుగుడు పంటను సాగు చేశారు. అయితే మండలంలోని ఆయా గ్రామాల్లో పొద్దుతిరుగుడు పంటను కోసి కల్లాల వద్ద ఉంచారు. వాటిని విక్రయించుకోవడానికి కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ధాన్యం దళారుల పాలు అయ్యే అవకాశం ఉందని రైతన్నలు వాపోతున్నారు. దీనికి తోడు అకాల వర్షాలు ఉండడంతో ధాన్యం తడిసి ముద్దయ్యే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేస్తే తమకు ఈ సమస్య వచ్చేది కాదని రైతులు పేర్కొంటున్నారు.
మూడు రోజులు అకాల వర్షాలు కురుస్తాయని చెప్పడంతో కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని రక్షించుకోవడానికి పట్టాలు కప్పుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. వర్షం కురిస్తే ధాన్యం పరిస్థితి ఎట్లా అని రైతులు ఆగమాగం అవుతున్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఎక్కడైనా పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే అక్కడికి తరలించుకుని గిట్టుబాటు ధర పొందుతామని రైతులు ఆశతో ఉన్నారు. అకాల వర్షాలు రాకముందే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.