రామాయంపేట, ఏప్రిల్ 21: మద్దతు ధర లేదని రైతులు ధైర్యాన్ని కోల్పోవద్దని ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చే వరకు కొట్లాడుదామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట నుంచి మెదక్ వెళ్తుండగా మార్గమధ్యంలోని రామాయంపేట మండలం తొనిగండ్లలోని రోడ్డు పక్కనే ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర ఇస్తుందా, క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తుందా, కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పిస్తుందా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. కనీస మద్దతు ధర లేదని, కొనుగోలు కేంద్రాల వద్ద సరైన వసతులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించడం లేదని రైతులు చెప్పారు. ధాన్యం తీసుకొచ్చిన రైతు సిద్దయ్య హరీశ్‌రావుతో మాట్లాడుతూ కష్టానికి తగిన ఫలితం లేదని, ధాన్యం కొనే దిక్కేలేదని, ధాన్యం కొంటారని 15 రోజుల నుంచి కొనుగోలు కేంద్రం వద్దే ఉంటున్నాం సర్ అని తెలిపాడు. మరో మహిళా రైతు నాగమణి మాట్లాడుతూ రోజూ ధాన్యం కొంటారని పనులన్నీ వదులుకొని కాపలా కాస్తున్నామని, వర్షాల వల్ల ధాన్యం తడిసిపోతుందని మొరపెట్టుకుంది. మరో రైతు మల్లేశం మాట్లాడుతూ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇన్ని కష్టాలు లేవు సార్ అని తెలిపాడు.
అన్నదాతలు ధైర్యాన్ని కోల్పోవద్దని, మీకు అండగా మేమున్నామని హరీశ్‌రావు ధైర్యం చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రానికి 15 రోజులుగా ధాన్యం తెచ్చినా ప్రభుత్వం కొనకపోవడం విడ్డూరంగా ఉన్నదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి రాజకీయాల మీద ఉన్న ప్రేమ పాలనపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. రైతుల బాధలు తెలుసుకుని న్యాయం చేయాలని సీఎంకు హితవు పలికారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాత రాజకీయాలు చేసుకో అని సూచించారు. వంద రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తానన్న కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి మొలకెత్తుతున్నా ప్రభుత్వం తూకాలు పెట్టకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ పాలనలోనే బాగుందని, అప్పుడు ఇన్ని కష్టాలు లేవని రైతులే నేరుగా చెప్పడం బాధగా ఉన్నదన్నారు. రైతుల కండ్లల్లో కన్నీరు తుడిచే వరకు మా పోరాటం ఆగదని హరీశ్‌రావు తెలిపారు. మాజీ మంత్రి హరీశ్‌రావు వెంట రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగు స్వామి, నిజాంపేట మాజీ సర్పంచ్ కొమ్మాట సత్యనారాయణ, అబ్దుల్ అజీజ్ తదితరులు ఉన్నారు.