నంగునూరు, మార్చి 4 : ప్రకృతి వైపరీత్యాలు ఎదురొంటూ ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్పడం లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఫర్టిలైజర్ షాపుల్లో ఇవ్వాల్సిన యూరియా యాపుల్లో ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామానికి చెందిన మక్కరైతులు హరీశ్‌రావును కలిసి తమగోడు వెల్లబోసుకున్నారు.
అరేపల్లి, అక్కెనపల్లి గ్రామాల్లో దాదాపు 350 ఎకరాల్లో మక్కసాగు చేస్తున్న రైతులు ప్రతిసంవత్సరం నష్టపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కర్షకులు తెలిపారు. కనీసం పండించిన పంట అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..ప్రకృతి వైపరీత్యాలు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం,మద్దతు ధర అందక మక రైతులు తీవ్ర నష్టాలు ఎదురొంటున్నారన్నారు. నంగునూరు మండలంతో పాటు ఇతర మండలాల్లో వందల ఎకరాల్లో మక సాగుచేస్తున్న రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.600 తకువ ధరకు విక్రయించి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక అక్కెనపల్లి రైతుల సమస్య మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా మక రైతులు ఇలాంటి ఇబ్బందులు ఎదురొంటున్నారన్నారు. అనేక జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమవడం, అసలు ఏర్పాటు చేయక పోవడం, చెల్లింపులు ఆలస్యం కావడం, రవాణా సదుపాయాలలేమి వంటి సమస్యలు రైతులను ఆర్థికంగా కుదేలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. మద్దతు ధర చెల్లించి మకలు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హరీశ్‌రావును కలిసిన వారిలో రైతులు బద్దిపడగ కృష్టారెడ్డి, తిప్పని నాగేంద్రం, దోనే నర్సయ్య, ఎంటే రాజు, బోసిపల్లి మల్లేశం. అనిల్, దోనే సంపత్, బోచేపల్లి సంపత్, గుడికందుల సత్యనారాయణ, సుకినే రాజు, పెద్దరాజు, నరేశ్, తదితరులు ఉన్నారు.
అక్కెనపల్లిలో సబ్‌స్టేషన్ ఏర్పాటుకు వినతి
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని అక్కెనపల్లిలో 33/కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావుకు గ్రామ రైతులు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో విద్యుత్ లోవోల్జేజీ సమస్య ఏర్పడడంతో తరచూ వ్యవసాయ మోటర్లు కాలుతున్న విషయాన్ని ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన విద్యుత్ ఎస్ఈకి ఫోన్లో సమస్య వివరించి తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. అం దుకు సంబంధించిన స్థలం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసిన నాయకులు
అమీన్పూర్(జిన్నారం) మార్చి 4 : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. రంగులు చల్లుతూ హోలి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం హరీశ్‌రావును నాయకులు ఘనంగా సన్మానించారు.