దుండిగల్,మార్చి4: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతినగర్ బాచుపల్లి-గండిమైసమ్మ ప్రధాన రోడ్డులో జరిగిన భారీ అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని బాధితులు తెలిపారు. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో రోడ్డు వెంబడి ఏర్పాటు చేసుకున్న ఫర్నిచర్ దుకాణాల్లోని ఓ దుకాణం ముందున్న కరెంట్ స్తంభం వద్ద బంచింగ్ కేబుల్ తెగిపోవడంతో ఫేజ్ టూ ఫేజ్ కావడంతో మంటలు చెలరేగాయని ఒక్క సారిగా పక్కనే ఉన్న ఓ ఫర్నిచర్ దుకాణంలోకి మంటలు వ్యాపించాయని పేర్కొన్నారు.
దుకాణంలో కలప, సోపాలు వంటి కర్రసామగ్రి అధికంగా ఉండటంతో చూస్తుండగానే అగ్ని కీలలు పక్కనున్న షాపులకు వ్యాపించాయని తెలిపారు. 24 దుకాణాలు బుగ్గిపాలయ్యాయని.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి,మంటలను ఆర్పి వేసినప్పటికి అప్పటికే భారీగా నష్టం జరిగిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలు రోడ్డున్న పడ్డాయని బోరున విలపించారు. డబ్బులు, బట్టలు, బంగారంతో పాటు తమ వ్యవసాయ పొలాలకు సంబంధించిన పత్రాలు సైతం ప్రమాదంలో కాలిబూడిదయ్యాయన్నారు.
ఒక్కో షాపు నిర్వాహకుడు రూ.10లక్షల నుంచి 50 లక్షల వరకు అప్పుతీసుకుని దుకాణాలు నిర్వహిస్తున్నట్లు వాపోయారు. రూ.10 కోట్ల ఆస్తినష్టం సంభంవించిందన్నారు. ఏపీలోని గుంటూరు,నరసరావుపేట పరిసర ప్రాంతాలకు చెందిన వారమని తెలిపారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన జరిగిందని బాధితులు వాపోయారు. ఎమ్మెల్యే,బీఆర్ఎస్ఎల్పీ విప్, కేపీ వివేకానంద్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బాధితులను పరామర్శించారు. ప్రభుత్వంతో మాట్లాడి సహాయం అందేలాచూస్తామని ఎమ్మెల్యే వివేకానంద్ హామీ ఇచ్చారు.
