Harish Rao | చిన్నకోడూర్, జులై 18 : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. విద్యాశాఖను తన దగ్గర పెట్టుకుని ఏనాడూ సమీక్ష నిర్వహించని గొప్ప ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని జిల్లా పరిషత్ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌ను ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. దాతల సహకారంతో విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం చిన్నకోడూరు పెద్దచెరువుపై నూతనంగా నిర్మించిన కట్ట మైసమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. విద్యారంగానికి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాఠశాలలను బలోపేతం చేసినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అందించినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా పిల్లలు బతికుంటే చాలని గురుకులాల నుంచి తమ పిల్లలను తల్లిదండ్రులు తీసుకేళ్లే పరిస్థితి దాపురించిందని అన్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గత 8 సంవత్సరాలు పాటు వరుసగా ఒకటి, రెండు స్థానాల్లోనే ఉండేదని హరీశ్‌రావు గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 24వ స్థానానికి పడిపోయిందని అన్నారు. ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి
విద్యార్థులు మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. విద్యార్థులు సోషల్‌మీడియా, వాట్సాప్‌నకు దూరంగా ఉండాలన్నారు. తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు.