టెహ్రాన్, మార్చి 1: ఇరాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మృతిచెందారు. ఇరాన్ మీడియా ఆదివారం ఉదయం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఖమేనీ మరణంతో ఇస్లామిక్ రిపబ్లిక్ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఖమేనీ మృతిని ప్రకటించారు. మీ దేశాన్ని తిరిగి తీసుకోవడానికి ఇది గొప్ప అవకాశమని ఆయన ఇరాన్ పౌరులకు పిలుపునిచ్చారు. ఖమేనీని చంపి ఇరాన్ ప్రజలకు న్యాయం చేశామని ఆయన అన్నారు. డౌన్‌టౌన్‌లోని ఖమేనీ కాంపౌండ్ లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల్లో 86 ఏండ్ల ఖమేనీ మృతి చెందారని ఆ దేశ మీడియా ప్రకటించింది. ఖమేనీ మృతితో 40 రోజుల సంతాప దినాలతో పాటు ఏడు రోజుల పాటు జాతీయ సెలవు దినాలను ఇరాన్ ప్రకటించింది. ఈ దాడిలో ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు కూడా మృతి చెందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తోపాటు పలు గల్ఫ్ దేశాలపై దాడులను ముమ్మరం చేసింది. అమెరికాకు చెందిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధనౌకపై దాడి చేశామని ఇరాన్ ప్రకటించగా, అమెరికా తోసిపుచ్చింది. తాజా ఉద్రిక్తతలతో పశ్చిమాసియా పూర్తి స్థాయి యుద్ధం దిశగా నడుస్తున్నది.
ప్రతీకారం తీర్చుకుంటాం
ఖమేనీ మృతితో తీవ్రంగా స్పందించిన ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ‘ఈ నేరానికి ఎన్నడూ సమాధానం దొరకదు’ అని క్యాబినెట్ పేర్కొంది. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అత్యంత తీవ్రమైన దాడి ఆపరేషన్‌ను ప్రారంభిస్తామని పారా మిలిటరీ రివల్యూషనరీ గార్డ్ హెచ్చరించింది. ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సాయుధ దళాల చరిత్రలో అత్యంత తీవ్రమైన దాడి ఆపరేషన్ ఇజ్రాయెల్, అమెరికన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షణాల్లో ప్రారంభం అవుతుంది’ అని తెలిపింది. మీరు మా సుప్రీం నేత ఖమేనీని చంపడం ద్వారా చాలా ప్రమాదకరమైన రెడ్ లైన్‌ను దాటారు అంటూ అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ విదేశాంగ సహాయ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదే మాట్లాడుతూ తమపై దాడులను ప్రారంభించి ట్రంప్ పెద్ద తప్పు చేశారని, దీనికి ఆయన తీవ్ర పరిణామాలు చవిచూస్తారని సున్నీ ముస్లిం నేత కూడా అయిన సయ్యద్ పేర్కొన్నారు. ఖమేనీ మృతితో ఆయన మద్దతుదారులు తీవ్ర విషాదంలో మునిగిపోగా, మరికొందరు వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకోవడం గమనార్హం. ఖమేనీ మృతితో షియా ముస్లింలకు ప్రధాన యాత్రా స్థలం, ఇరాన్లో రెండో అతి పెద్ద నగరమైన మషద్‌లోని ఇమా రెజమ్ మందిరంపై నల్ల జెండాను ఎగురవేశారు.
ఇరాన్ తాత్కాలిక సుప్రీంగా అలీరెజా అరాఫీ
సీనియర్ మతాధికారి అయాతొల్లా అలీరెజా అరాఫీ ఇరాన్ తాత్కాలిక సుప్రీంగా వ్యవహరించనున్నారు. ప్రభుత్వానికి చెందిన ఐఎస్ఎన్ఏ వార్తా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఖమేనీ మరణం తర్వాత వారసుడిని ప్రకటించే వరకు అత్యవసరంగా నాయకత్వం చేపట్టేందుకు సభ్యుడిని ఎంపిక చేసే బాధ్యత ఆ దేశ రాజ్యాంగంలోని 111వ అధికరణ ముగ్గురు సభ్యులకు ఇస్తుంది. ఈ పద్ధతిలో ఎంపికైన అరాఫీ ప్రస్తుత దేశ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్, ప్రధాన న్యాయమూర్తి ఘోలం హొస్సెన్-ఎజీలతో కలిపి దేశాన్ని నడిపిస్తారు. 67 ఏండ్ల అరాఫీ ఇరాన్ మతాధికారి వ్యవస్థలో సీనియర్. అలాగే తాజా దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) చీఫ్ జనరల్ మహమ్మద్ పాక్పుర్ మరణించడంతో ఆయన స్థానంలో అహ్మద్ వాహిదీని నియమించినట్టు ఇరాన్ మీడియా తెలిపింది.
ఇరాన్ రక్షణ మంత్రి సహా పలువురు మృతి
అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీ ప్రధాన సలహాదారుడు లీ షామ్‌ఖనీ, శక్తిమంతమైన రివల్యూషనరీ గార్డ్స్ హెడ్ జనరల్ మహ్మద్ పాక్పూర్ కూడా మరణించారు.అలాగే ఇరాన్ రక్షణ మండలి సమావేశాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన వైమానిక దాడిలో ఇరాన్ సైన్యాధిపతి, రక్షణ మంత్రి మరణించారని ఇరాన్ ప్రభుత్వం టెలివిజన్ ఆదివారం ప్రకటించింది. సమావేశంలో పాల్గొన్న అబ్దుల్ రహీమ్ మౌసాని, రక్షణ మంత్రి జనరల్ అజీజ్ నసిర్జాదేతో పాటు ఇరాన్ పారా మిలిటరీ రివల్యూషనరీ గార్డ్ అధిపతి, భద్రతా సలహాదారు అలీ షంఖానీ మరణించారని తెలిపింది.
ముగ్గురు మృతి..ఐదుగురికి గాయాలు: యూఎస్
తాము చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ముగ్గురు అమెరికా సభ్యులు మరణించగా, ఐదుగురు గాయపడ్డారని, ఇదంతా విధి నిర్వహణ ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిందని అమెరికా అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ తన వంతుగా రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్, దేశ రక్షణ మంత్రిని, ఖమేనీ సలహాదారుడు, ఇరాన్ భద్రతా మండలి కార్యదర్శిని చంపినట్టు తెలిపింది. పశ్చిమాసియా అంతటా శాంతి అనే లక్ష్యాన్ని సాధించడానికి తమ దాడి కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.
ముగిసిన 36 ఏండ్ల పాలన

ఇరాన్‌ను ఖమేనీ ఏకఛత్రాధిపత్యంగా 36 ఏండ్లు పాలించారు. 1939లో పవిత్ర నగరమైన మాషాద్లో జన్మించిన ఖమేనీ 1979లో రుహొల్లా ఖొమేనీ నేతృత్వంలో ఇస్లామిక్ విప్లవానికి దారి తీసిన ఇరాన్ రాజకీయ తిరుగుబాట్ల సమయంలో కీలక మత వ్యక్తిగా ఎదిగారు. రుహొల్లా ఖొమేనీకి సన్నిహితుడిగా వ్యవహరించిన ఆయన షా మహ్మద్ రెజా పహల్వీ పాలన సమయంలో ప్రభుత్వ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడినందుకు తరచూ అరెస్ట్ అయ్యేవారు. విప్లవం ఇరాన్‌ను పునర్నిర్మించిన తర్వాత రాజకీయంగా త్వరగా ఎదిగారు. ఇరాన్-ఇరాక్ యుద్ధం కారణంగా ఏర్పడిన అల్లకల్లోలంలో ఆయన 1981 నుంచి 1989 వరకు దేశ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో ఖొమేనీ మరణం తర్వాత ఇరాన్ రెండో సుప్రీం నేతగా నియమితులయ్యారు. 1989లో రుహొల్లా ఖొమేనీ నుంచి బాధ్యతలు చేపట్టిన ఆయన తిరుగులేని నేతగా చెలామణి అయ్యారు. అయితే దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభంపై పౌరుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
వేలాది మంది వీధుల్లోకి వచ్చి ఖమేనీ పాలన పట్ల నిరసన వ్యక్తం చేశారు. వారి నిరసనలకు ట్రంప్ మద్దతుగా ప్రకటించడమే కాక, అవసరమైన సమయంలో తాను జోక్యం చేసుకుంటానని ప్రకటించారు. అయితే ఈ నిరసనలను ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసింది. ఈ క్రమంలో వేలాది మంది పౌరులను కాల్చి చంపింది. వేలాది మందిని నిర్బంధించింది. సుమారు 12 వేల మందిని ఖమేనీ ప్రభుత్వం హతమార్చినట్టు అంతర్జాతీయ సంస్థలు తెలిపాయి. ఇన్నాళ్లు ఖమేనీ ప్రభుత్వానికి అండగా ఉన్న హమాస్, హౌతీలు, హెజ్బొల్లాలు బలహీనపడటంతో ఖమేనీకి పెద్ద దెబ్బగా మారింది. అటు ఇజ్రాయెల్‌తో ఎప్పటినుంచో కొనసాగుతున్న వైరం, దానికి అమెరికా పూర్తి మద్దతు ఇవ్వడంతో దానిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి ఇరాన్ చేరుకుంది. దీంతో ఖమేనీ శకం ముగిసినట్టేనని చాలామంది ఇటీవల అంచనా వేస్తూ వచ్చారు. ఖమేనీ సైతం తన మరణాన్ని ముందే ఊహించారని ఇటీవల చేసిన ప్రకటనలు చెప్పాయి.
ఖమేనీకి భారత మూలాలు
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి భారత మూలాలు ఉన్నాయి. ఆయన పూర్వీకులు యూపీలోని బారాబంకి జిల్లా కింతూరు గ్రామానికి చెందినవారు. చారిత్రకంగా షియా పండితుల స్థానంగా పిలిచే ఈ గ్రామంలో ఇస్లామిక్ విప్లవానికి రూపశిల్పి, ఇస్లామిక్ రిపబ్లికన్ ఆఫ్ ఇరాన్ వ్యవస్థాపక పితామహుడు అయతుల్లా రుహొల్లా, ముసావి ఖొమేనీ పూర్వీకులు నివాసమున్నారు. ఖమేనీ తాత సయ్యద్ అహ్మద్ ముసావి కింతూరు గ్రామంలోనే 19వ శతాబ్దం ప్రారంభంలో జన్మించారు. ఆయన భారత్ నుంచి ఇరాన్‌లోని నజఫ్‌కు బయలుదేరి 1834లో ఖొమేన్ నగరంలో స్థిరపడ్డారు. శతాబ్దం తర్వాత ఆయన కుటుంబ వారసులు ఆ దేశంలో రాజకీయ, మతపరంగా శక్తిమంతమైన నేతలుగా ఎదిగారు. ముసావి తన భారతీయ మూలానికి గుర్తుగా ‘హిందీ’ అనే బిరుదును నిలుపుకున్నారు. ఆ వివరాలు ఇరానియన్ రికార్డుల్లో కూడా ఉన్నాయి. ఇరాన్‌ను ఆధ్యాత్మికంగా రూపొందించడంతో ముసావి కీలకంగా నిలిచారని పండితులు ఆయనను ప్రశంసిస్తుంటారు.