 
                                                            తొగుట: దేశానికి వెన్నుముక యువత అని, వారు సన్మార్గంలో నడిచినప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుందని తొగుట సీఐ లతీఫ్ పేర్కొన్నారు. దేశ తొలి హోంశాఖ మంత్రివర్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తొగుటలో పోలీస్ సిబ్బంది యువతతో కలిసి 2కే రన్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుంచి రాంపూర్ దేవాలయం వరకు రన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతపై మద్యం, అశ్లీల సినిమాలు, సోషల్ మీడియా, ఆన్ లైన్ గేమ్స్, డ్రగ్స్ చాలా ప్రభావం చూపుతున్నాయని, వాటి నుంచి బయటపడి వారి బంగారు భవిష్యత్తు కోసం ముందుకు సాగాలన్నారు. 90 శాతం రోడ్డు ప్రమాదాలు మద్యం సేవించడం వల్లనే జరుగుతున్నాయని, మైనర్లు వాహనం నడిపినా, మద్యం సేవించి వాహనం నడిపినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకున్నా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహా పురుషులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఆయన కోరారు. కులం, మతం, ప్రాంతం సంబంధం లేకుండా జాతీయ సమైక్యత తో కలిసి మెలిసి ఉండలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తొగుట ఎస్సై రవి కాంతారావు, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, మాజీ సర్పంచ్ బొడ్డు నరసింహులు, పోలీస్ సిబ్బంది, యువత తదితరులు పాల్గొన్నారు.
 
                            