Harish Rao | ఈసారి యాసంగి పంటకు సాగునీటి ఇబ్బందులు తలెత్తాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అధికారుల సమన్వయంతో తాత్కాలిక కాల్వ ఏర్పాటు చేయడం వల్ల కొంత ఇబ్బందులు తొలిగాయని పేర్కొన్నారు. వచ్చే యాసంగి పంట వరకు శాశ్వతంగా కాలువను ఏర్పాటు చేయాలని.. అందుకు తగిన ప్రణాళిక చేపట్టాలని సూచించారు.
సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో హరీశ్‌రావు శుక్రవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. సిద్దిపేట నియోజకవర్గంలో పలు గ్రామాల్లోని సాగు నీటి సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈసారి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించామని పేర్కొన్నారు. ఆయకట్టు పెరిగిన దృష్ట్యా Rd -7,Rd-8,Rd- 9 కాలువలను త్వరితగతిన పూర్తి చేయాలని, రంగనాయకసాగర్ – మల్లన్న సాగర్‌ను అనుసంధానం చేయాలని కోరారు. నియోజకవర్గంలోని పెండింగ్ పనులు, పెండింగ్ కాల్వలను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఇర్కోడ్ లిఫ్ట్ పనులను వేగవంతం చేయాలన్నారు. చందలాపూర్ లిఫ్ట్ పనులు, కస్తూరిపల్లి, గోపులాపూర్ చెక్‌డ్యామ్ పనులు ప్రారంభం చేయాలన్నారు. పెండింగ్ పనులను పూర్తిచేసిన ఘన్పూర్ పంప్‌హౌజ్‌ను ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు.