Mallanna Sagar | రాయపోల్, జూలై 17 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుగా రైతుల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ సాగునీటి వనరులకు పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని దౌల్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సర్వు గారి యాదవ రెడ్డి పేర్కొన్నారు.
గురువారం ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలపై తెలంగాణ రాష్ట్రం సాధించుకుని అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేని నాయకులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ద్వారా తెలంగాణ సస్యశ్యామలం చెందిందని.. ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్ర పాలకులకు తాకట్టు పెడుతోందని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీసిందని ఆయన గుర్తు చేశారు.
రైతులు గోస పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు..
వర్షాలు లేక రైతులు గోస పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వర్షాలు కురవకపోవడంతో పత్తి, మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటినా కొత్త కాలువలు దేవుడెరుగు, పాత కాలువలు పూడిక కూడా తీయడం లేదన్నారు. పంటలు ఎండిపోతున్నా నీటిని విడుదల చేయడం లేదని.. వరి నాట్లు వేయలేకపోతున్నామని రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి మల్లన్నసాగర్ కొండ పోచమ్మ ప్రాజెక్టు నింపి ప్రధాన కాలువల ద్వారా నీటిని విడుదల చేసి గొలుసు కట్టల చెరువు కుంటలు, వాగులు నింపాలన్నారు. గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నా ఎత్తిపోతల ద్వారా జలాలను తరలించకపోవడం దారుణమన్నారు. గోదావరి జలాలు ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రానికి దక్కుతాయని. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర పాలకులకు దాసోహం కావడం పట్ల ఆయన విమర్శించారు.
ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పాలని.. లేనిపక్షంలో రైతుల పక్షాన ఉండి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి నీళ్లు వచ్చేవరకు రైతులతో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన రేవంత్ రెడ్డి సర్కార్ ఆంధ్ర పాలకులకు వత్తాసు పలకడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రయోజనాలకు ఇంత నష్టం జరుగుతున్నా ఈ ప్రాంత మంత్రులు. ఎమ్మెల్యేలు అడ్డుకోకపోవడం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పతనానికి కారణమవుతుందని పేర్కొన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఆదరణ చూపుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Siddipeta | రైతుల గోస రేవంత్ రెడ్డికి వినబడట్లేదా..? : జీడిపల్లి రాంరెడ్డి
Oil Palm | ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక లాభాలు..
Medak | కల్లు.. కల్లు.. కల్లమ్మ కల్లు.. కొత్త పుంతలు తొక్కుతున్న కల్తీకల్లు వ్యాపారం