Siddipeta | తొగుట : సాగునీటి కోసం రైతులు అరిగోస పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని, మల్లన్న సాగర్ నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి డిమాండ్ చేశారు. తొగుటలో బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
వర్షాలు కురియక పోవడంతో పత్తి, మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటినా కొత్త కాలువలు దేవుడెరుగు, పాత కాలువలు పూడిక కూడా తీయడం లేదన్నారు. పంటలు ఎండిపోతున్నా నీటిని విడుదల చేయకపోవడంతో వరి నాట్లు వేయలేక పోతున్నామని రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు, వాగులు నింపాలన్నారు. గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నా ఎత్తిపోతల ద్వారా జలాలను తరలించకపోవడం దారుణమన్నారు.
కేసీఆర్ హయాంలో మల్లన్న సాగర్ నిర్మించుకుంటే కాలువలు నిర్మించి రైతుల పొలాలకు నీళ్లు ఇవ్వాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏడాదిన్నర కాలంగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ హయాంలో కూడవెల్లి వాగు జీవనదిగా మారిందని, నేడు కూడవెల్లి వాగు ఎండిపోయిందని వెంటనే నీళ్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలన్నారని, సాగునీటి, తాగునీటి కోసం, విత్తనాలు, ఎరువులు, యూరియా కోసం లైన్ కట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్నారు. కాళేశ్వరం మీద దుష్ప్రచారం మాని, నీళ్లు వచ్చేలా చూడాలని కోరారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు చిలువేరి మల్లారెడ్డి తెలిపారు. వారంలోగా మల్లన్న సాగర్ నుండి జలాలు విడుదల చేయకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు బంధు మండల మాజీ అధ్యక్షులు బోధనం కనకయ్య, నాయకులు పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, సుతారి రమేష్, మాదాసు అరుణ్ కుమార్, నరేందర్ గౌడ్, చిక్కుడు రమేష్, మంగ యాదగిరి, ఆల్వాల రాజిరెడ్డి, బోయిని శ్రీనివాస్, అనిల్, చిప్ప నర్సింలు కర్ణాకర్, ఎంగలి నరేందర్, కత్తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.