Oil Palm | జగదేవపూర్, జూలై 17 : ఆయిల్ పామ్ తోటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందచవ్చని గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని తిమ్మాపూర్ ప్రహర్ష డెయిరీ ఫారమ్‌లో 16 ఎకరాలలో మెగా అయిల్ పామ్ ప్లాంటేషన్‌ను పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ములుగు డివిజన్ వ్యవసాయ సంచాలకులు అనిల్‌కుమార్, మండల వ్యవసాయ అధికారి వసంతరావులతో కలిసి చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ తోటల సాగుకు ప్రభుత్వం డ్రిప్పు కోసం 80 నుండి 100 శాతం రాయితీ, మొక్కలపై 90 శాతం రాయితీలు కల్పిస్తుందన్నారు. అదే విధంగా మొక్కలు నాటిన నుండి నాలుగు సంవత్సరాల వరకు ఎకరానికి రూ.4200 చొప్పున పెట్టుబ డిసాయం అందిస్తుందన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించేందుకు రైతులు ఆయిల్ పామ్ తోటల సాగుకు ముందుకు రావాలని సూచించారు. మండలంలో సుమారు 570 ఎకరాల్లో ఆయిల్ ఫామ్తోటల పెంపకం జరుగుతుందన్నారు. అదే విధంగా ఈ తోటల్లో నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటల సాగు చేపట్టుకోవచ్చని తెలిపారు. ఆయిల్ పామ్ తోటల సాగుపై ఎలాంటి సందేహాలున్నా ఉద్యాన, వ్యవసాయ అధికారులతో పాటు ఆయిల్ ఫెడ్ అధికారులను సంప్రదించాల నిసూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, గజ్వేల్ హార్టికల్చర్ అధికారిణి సౌమ్య, ఆయిల్ ఫెడ్ అధికారులు విజయ్, ఏఈవోలు ఖలీల్, కృష్ణ, సమత, రైతులు పాల్గొన్నారు.