Medak | పాపన్నపేట, జులై 17 : కల్లు.. కల్లు.. కల్లమ్మ.. కల్లు.. మీ ఇంటికి వచ్చాం… మీ గల్లి కొచ్చాం… త్వరపడండి అమ్మ… త్వరపడండి… అంటూ ఆటోలలో కల్లు పెట్టెలు పెట్టుకుని మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కల్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం లైసెన్స్ ఉన్న జాగలే కల్లు అమ్మకాలు చేయాలి. టిఎఫ్టి, ఎస్ఎప్టీ అనే లైసెన్సులు ఉంటాయి. అవి ఉన్న జాగలే అమ్మకాలు కొనసాగించాలి కానీ, కొంతమంది ఎలాంటి లైసెన్సులు లేకుండా నిబంధనలను తుంగలో తొక్కి ఆటోలపై ఇంటింటికి తిరుగుతూ కల్తీకల్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఆటోకు మైకు పెట్టుకొని మరి మైక్‌లో అనౌన్స్ చేస్తూ సైతం అమ్మకాలు జరుపుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ ఆటో కల్లు తాగని వారి ఇంటి ముందు ఆపడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్తీకల్లు ఆటో ఇంటి ముందు ఆగడంతో సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా నాగసనపల్లిలో ఇలా ఆటోలో కల్లు అమ్మకాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి, అంతేకాకుండా మెదక్ బొడ్మెట్‌పల్లి ప్రధాన రహదారిపై కొత్తపల్లి, యూసుఫ్ పేట, నార్సింగి, గ్రామాల వద్ద మెయిన్ రోడ్డుపై కల్తీకల్లు దుకాణాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా టేక్మాల్, జోగిపేట తదితర ప్రాంతాల నుండి ఏడుపాయలకు వెళ్లి ప్రధాన రహదారిపై గాజుల గూడెం, కొడపాక, ఎంకేపల్లి, యేనె చౌరస్తా వద్ద కూడా ప్రధాన రహదారిపై కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నారు. వీటితోపాటు అరికెల నుండి పెద్ద శంకరంపేట వైపు వెళ్లే ప్రధాన రహదారిపై, అలాగే ఏడుపాయల దుర్గామాత ఆలయం సమీపాన సైతం అక్రమ కల్తీ కల్లుదుకాణం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారిపై కల్తీకలు దుకాణాలు నిర్వహించడంతో కల్లు తాగే వారు రోడ్డుపై వాహనాలు ఆపడం మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా రోడ్డు పక్కన కల్లు దుకాణం ఉండడం మూలంగా కల్లు తాగిన వారు మత్తుతో బయటకు వచ్చి పెద్ద ఎత్తున ప్రమాదాల బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులు కల్తీకల్లు అరికట్టడంతో పాటు ప్రధాన రహదారులపై ఉన్న కల్లు దుకాణాలను తొలగించాలని రహదారిపై వెళ్లి ప్రయాణికులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అయితే సంబంధిత అధికారులు ప్రతి కల్లు దుకాణం నుండి నెలకు రూ. 3000ల చొప్పున మామూలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై మెదక్ ఎక్సైజ్ సిఐని వివరణ కోసం ప్రయత్నించగా ఆయన స్పందించకపోవడం గమనార్హం.