Harish Rao | అన్ని వర్గాల ప్రజలు పైకి వచ్చేలా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ గత పదేండ్లలో హిందువుల అభ్యున్నతి కోసం ఏవిధంగా పాటుపడ్డారో.. అలాగే మైనారిటీల అభ్యున్నతి కోసం కూడా అంతే పాటుపడ్డారని తెలిపారు. సిద్దిపేటలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. రంజాన్ పండుగను హిందూ, ముస్లిం అనే భేదాభిప్రాయాలు లేకుండా చేసుకోవాలని సూచించారు. నిన్న ఉగాది పండుగ రోజు ముస్లింలు హిందువుల ఇండ్లలోకి వచ్చి బక్షాలు తిని.. ఉగాది శుభాకాంక్షలు తెలిపారని అన్నారు. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా హిందువులు ముస్లిం సోదరులను అలయ్ బలాయ్ చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్ల నుంచి మన దేశం, రాష్ట్రం మతాలకతీతంగా సోదర భావంతో ఒకరి పండుగల్ని ఒకరు.. ఒకరి సంప్రదాయాన్ని మరొకరు గౌరవిస్తూ ఎంతో సఖ్యతతో జీవిస్తున్నారని తెలిపారు. కొన్ని శక్తులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అందరూ ఓపికతో, శాంతితో, సౌభాగ్యంతో కలిసి మెలసి ఈ దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం సోదర భావంతో అందరం కలిసి కృషి చేయాలని కోరారు.