ఢాకా: భద్రతా కారణాలతో టీ20 వరల్డ్‌కప్‌ను భారత్‌లో ఆడబోమని పట్టుదలకు పోయి బహిష్కరణకు గురైన బంగ్లాదేశ్ పరిస్థితి ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు’గా తయారైంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం, ఆ దేశ క్రికెట్ బోర్డు (బీసీబీ) వల్ల తమ జట్టు సువర్ణావకాశాన్ని కోల్పోయిందని ఇప్పటికే ఆ దేశ అభిమానులు, పలువురు క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్న వేళ బీసీబీ మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అష్రాఫుల్ హక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఒక క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా నేను నిబద్ధత, నిజాయితీని విశ్వసిస్తాను. అమీనుల్ ఇస్లాం (బీసీబీ అధ్యక్షుడు) అమాయకుడు. అతడిని ప్రస్తుత ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మోహ్సిన్ నఖ్వీ ప్రభావితం చేశాడు. ఈ విషయం (భారత్‌లో ఆడకూడదని)లో అతడిపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. కానీ ఇప్పుడు గెలిచెందెవరు? మా ప్రభుత్వం సైతం భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. అందుకు సరైన కారణాలేమీ లేవు. మా దేశ క్రికెట్ బోర్డుకు భారత క్రికెట్ పరిపాలకుల మద్దతు ఎంతో అవసరం. జగ్మోహన్ దాల్మియా హయాంలో మేం వాళ్లతో సఖ్యంగా ఉండేవాళ్లం. మాకు సరైన గుర్తింపు, గౌరవం దక్కేది. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోని కొంతమంది వ్యక్తుల కారణంతో మేం నవ్వుల పాలయ్యాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.