హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని మఫ్ఖమ్ జా ఇంజినీరింగ్ కాలేజీలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి టీజీఈఏపీసెట్ కౌన్సెలింగ్ ద్వారా చేపట్టే ప్రవేశాలు ఆ కళాశాల దాఖలు చేసిన రిట్ పిటిషన్పై తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
ఏఐసీటీఈ నిర్దేశించిన నిబంధనల అమలుతోపాటు మఫ్ఖమ్ జా ఇంజినీరింగ్ కళాశాలకు సంబంధించిన అనుమతులపై పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్ విచారణను వీలైనంత త్వరగా ముగించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం సింగిల్ జడ్జికి సూచించింది. కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 14తో ముగియనున్న నేపథ్యంలో ప్రధాన రిట్ పిటిషన్పై ఈ నెల 12న విచారణ పూర్తిచేయాలని కోరింది.