జర భద్రం
అసలు సమస్యలను మరుగున పెడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అపసవ్య దిశగా సాగుతున్నది. ముఖ్యమంత్రి ఆదేశించారని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది మాదిరిగా భూరికార్డులను పట్టుకుని ఊర్ల మీదికొస్తున్నారు. ఇన్నేండ్లుగా పంటలు తీసుకుంటున్న భూములు ఇప్పుడు ‘మీ సొంతం కాదు’ అంటూ రైతులను బెంబేలెత్తిస్తూ వారిని తహసీల్ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. ఇదేదో కొంపముంచేలా ఉందని గ్రహించిన రెవెన్యూ మంత్రి..దళిత, గిరిజనుల భూములకు ఎలాంటి ఢోకా లేదని భరోసా ఇస్తున్నా ప్రజలకు మాత్రం నమ్మకం కలుగడం లేదు.
భూముల పరిస్థితి ఇలా ఉంటే, పంటల దుస్థితి మరోలా ఉన్నది. కష్టకాలంలో వర్షపు నీటిని కాపాడకుండా, వాటిని పక్క రాష్ర్టానికి అప్పజెప్పి తప్పులు మాత్రం గత సర్కార్‌పై మోపుతున్నారు ప్రస్తుత పాలకులు. ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు లేకుండా ప్రజల బాగోగులను గాలికి వదిలేశారు. అయితే ఈ తరహా అడ్డగోలు పాలనను ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎక్కడో ఓ చోట తిరుగుబాటు బావుటా లేవక తప్పదు. ఆ పనిని ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లా జూరాల రైతులు ఎత్తుకున్నారు. ఎన్నింటికో సర్దుకుపోయే రైతులు సాధారణంగా కోపోద్రిక్తులు కారు. ఒకవేళ కోపోద్రిక్తులైతే వారి ఆగ్రహానికి దిగిరాని వానే ఉండరు. కరువుకాలంలో కూడా శిస్తు మాఫీ చేయని ఆంగ్లేయులను ఎదిరించిన చరిత్ర వారిది.
కేంద్రంలో అయిదేండ్ల క్రితం మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి మళ్లించిన ఢిల్లీ రైతుల ఆందోళన చరిత్రాత్మకమైనది. ఏ రాజకీయ జెండా లేకుండా తమకు తాముగా రంగంలోకి దిగి విజయాలు సాధించడం రైతులకు బాగా తెలుసు. ఇదే ఫలితాన్ని జూరాల ప్రాజెక్టు కింద సాగు చేస్తున్న రైతులు తమ పట్టుదలతో సాధించారు. నీళ్లు ఇవ్వడం కుదురదని ఖరాఖండీగా చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి తమ దారిలోకి తెచ్చుకున్నారు. దుష్టబుద్ధితో వర్షపు నీటిని సముద్రంపాలు చేసిన రాష్ట్ర సర్కార్ ప్రస్తుతం ప్రాజెక్టులో మిగిలి ఉన్న నీటిని కూడా ఇవ్వకుండా అడ్డం పడడడాన్ని రైతులు సహించలేకపోయారు.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే నీటికి కటకట ఎదురవుతున్నది. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రం కావచ్చు. జూరాల డ్యామ్‌లోని నీటిని పంటలకు వినియోగిస్తే తాగునీటి సమస్య తలెత్తుతుందనేది ప్రభుత్వ వాదన. ఇదే విషయాన్నే పలువురు మంత్రులు మీటింగులు పెట్టి వల్లించారు. కానీ రైతుల ప్రశ్న ఒక్కటే..నారు అలికేప్పుడు, నాట్లు వేసిన వరి ఏపుగా పెరిగేప్పుడు నీటిని అందించి, పంట చేతికొచ్చే సమయంలో నీరు ఇవ్వబోమని అనడం ఎంత అన్యాయమని నిలదీస్తున్నారు.
లక్షలాది రూపాయల కష్టం పోసి పంటలకు పెట్టిన పెట్టుబడి నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని రైతులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కర్షకులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సరైన జవాబు లేదు. పాలకులు చెప్పే సమాధానాలు రైతులను కాపాడలేవు. ఇది ఒకరిద్దరు రైతుల సమస్య కానేకాదు. అందుకే జూరాల రైతులు తెగించి ముందుకొచ్చారు. పోలీసులను ఎదిరించి మరీ తమ పంట పొలాలకు నీళ్లను వదులుకున్నారు. కృష్ణా నదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్టు ఆయకట్టు కింద సుమారు లక్ష ఎకరాల సాగు భూమి ఉన్నది. ఒక ఎకరా పంటకు పెట్టుబడి సుమారు రూ.20 వేలు అని లెక్క వేసుకున్నా రైతుల సొమ్ము దాదాపు రూ.200 కోట్లు ఇప్పటికే ఖర్చు అయినట్టుగానే భావించాలి.
జూరాల ఎగువ ప్రాంతంలో ఈ ఏడాది జూలైలో కురిసిన వర్షాల వల్ల ప్రాజెక్టు పూర్తిగా నిండింది. కుడి, ఎడమ కాలువల నుంచి నీరు విడుదల చేయడం వల్ల రైతులు సాగు పనులు ఆరంభించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సుమారు 10 టీఎంసీల కెపాసిటీ ఉన్న జూరాల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిలువ 7 టీఎంసీల దిగువకు పడిపోయింది. ఇదిలావుండగా, పాత మహబూబ్‌నగర్ జిల్లాకు విద్యుత్తు ఉత్పత్తి, సాగు, తాగు నీరు అందించే ఈ ప్రాజెక్టులోని ప్రస్తుత నీటిని కేవలం తాగునీటి సరఫరాకు వినియోగించాలని ప్రభుత్వం సంకల్పించింది. రైతుల పంటల విషయంలో మాత్రం సర్కార్ ఎలాంటి ఆలోచన చేయలేదు. తమ మాటకు కట్టుబడి రైతులు తమకు తాముగానే పంట నష్టానికి సిద్ధపడతారని ప్రభుత్వం గుడ్డిగా అనుకున్నది.
ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులను ఒప్పించే బాధ్యతను కూడా తీసుకున్నారు. అయితే రైతులు మాత్రం ప్రభుత్వం కంటే తమకు పంటలే ముఖ్యమని స్వయంగా వెళ్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసుకున్నారు. విపక్ష నేతలను హౌస్ అరెస్టు లేదా మార్గమధ్యంలో పట్టుకుని ఎక్కడో దూరాన వదిలేసిన పోలీసులు రైతుల ముందు చేష్టలుడిగి నిలబడిపోక తప్పలేదు. రైతులను అడ్డగించినా, అరెస్టులు చేసినా పరిస్థితులు అదుపు తప్పేలా ఉన్నాయని గ్రహించిన ప్రభుత్వం ఇప్పుడు తన రూటు మార్చుకున్నది.
పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఆ రాష్ట్రం నుంచి నీళ్లు రప్పించుకుని తెలంగాణ రైతుల పంటలను కాపాడవచ్చుననే కనీస ఆలోచన కూడా మన ప్రభుత్వ పెద్దలకు రాలేదు. రైతులు మొండిధైర్యంతో నీళ్లు పారించుకున్నాక మన మంత్రులు కర్ణాటక ప్రభుత్వాన్ని సంప్రదించడం మొదలుపెట్టారు. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల ఫోన్ సంభాషణలో ఈ సమస్య ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఇక పంటలకు ఢోకా లేకపోగా, కర్ణాటక సర్కార్ ఇచ్చే నీటితో తాగునీటి ఎద్దడి కూడా తీరవచ్చు.
సాధారణ రైతులు ఇలా ప్రభుత్వం కండ్లు తెరిపించడం విశేషం. రైతుల విజయాన్ని పొగడుతూ.. వారు ఎంచుకున్న బాట రాష్ట్రంలోని మిగతా బాధిత వర్గాలకు కూడా స్ఫూర్తిగా పనికొస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజా పాలన అని చెప్పుకునే ఈ ఫక్తు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలు ఇక సహించేలా లేరని జూరాల రైతులు రుజువు చేశారు. వారికి జేజేలు.
బద్రి నర్సన్