జిల్లాలో నిజాయితీ, నిబద్ధత కలిగిన పోలీసుల కంటే అవినీతి, అక్రమాలకు పాల్పడే పోలీసులే ఎక్కువయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలీస్ శాఖనే కాకుండా అన్ని శాఖల్లో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయనే ప్రచారం జరుగుతున్నది. భూముల ధరలు ఎక్కువగా ఉండి, ఎక్కువగా సంపాదన వచ్చే పోలీస్ స్టేషన్లను ముందే ఎంచుకుంటున్న పలువురు సబ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు సంబంధిత పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ కోసం ప్రజాప్రతినిధులకు రూ.లక్షల్లో డబ్బులిచ్చి వస్తున్నారనే ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జోరుగా జరుగుతున్నది. పోస్టింగ్ వచ్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకిస్తున్న డబ్బులను తిరిగి రాబట్టుకునేందుకు సామాన్యులు, పేదలు అనే తేడా లేకుండా వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాల్సిన పోలీసులు.. లంచం ఇచ్చి పోస్టింగ్ పొందుతుండటంతో సంపాదనే లక్ష్యంగా కొందరు పోలీసు అధికారులు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వికారాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని కొన్ని పోలీస్ స్టేషన్లు అయితే ఏకంగా సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయాయి. సివిల్ (భూ తగాదాలు) వ్యవహారాల్లో తలదూర్చొద్దంటూ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నప్పటికీ కొందరు పోలీసు అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న భూ సెటిల్మెంట్లలో పేదలకు అన్యాయం జరుగుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. డబ్బులిచ్చే వారివైపే నిలుస్తూ న్యాయం జరుగుతుందనే నమ్మకంతో వచ్చే పేదలకు అన్యాయం చేస్తూ పోలీస్ శాఖకు మాయని మచ్చగా కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తున్నది. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఊదాసీనంగా వ్యవహరిస్తుండటంతో పలువురు ఎస్ఐలు, సీఐలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే ప్రచారం జరుగుతున్నది.

సన్నగిల్లుతున్న నమ్మకం
ఇటీవల జిల్లా కేంద్రానికి సమీపంలోని పలు పోలీస్ స్టేషన్లలోని ఎస్‌హెచ్‌వోలు తరచూ సివిల్ తగాదాల్లో తలదూర్చి రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సమయంలో ఓ కానిస్టేబుల్ పరేడ్‌కు హాజరుకాలేదని అతన్ని సంబంధిత పీఎస్ నుంచి వెంటనే బదిలీ చేసిన జిల్లా ఉన్నతాధికారులు.. సివిల్ తగాదాల్లో తలదూర్చి పోలీస్ శాఖను పూర్తిగా భ్రష్టుపట్టిస్తున్న కొందరు ఎస్‌హెచ్‌వోలు, పేకాట ఆడుతూ పట్టుబడిన సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పోలీస్ శాఖలోని పలువురు సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా అవినీతి, అక్రమాలకు పాల్పడే పోలీసులపై సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరముందని జిల్లా ప్రజానీకం కోరుతున్నారు. భూ తగాదాలు మొదలుకొని ఇసుక దందా వరకు పోలీసులు తలదూర్చుతుండటంతో పోలీసులపై ప్రజల్లో నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతున్నది. ప్రజల మాన, ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులు అడ్డదారులు తొక్కుతూ పోలీస్ స్టేషన్లను సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చుకుంటున్నారనే ఆరోపణలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. జిల్లా కేంద్రానికి సమీపంలోని పలు పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలపై తీవ్ర అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భయభ్రాంతులకు గురి చేస్తున్న పోలీసులు
ఇటీవల ఓ ఎస్‌హెచ్‌వో ఓ భూ తగాదాలో తలదూర్చి బాధితుల వద్ద రూ.లక్షల్లో వసూలు చేసి తదనంతరం వారిపైనే కేసులు పెట్టి భయపెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. ఎర్రమట్టి మాఫియాతోనే చేతులు కలిపి టిప్పర్‌కు రూ.500 చొప్పున వసూలు చేస్తూ, డబ్బులివ్వని ఎర్రమట్టి అక్రమ వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిండికేట్‌గా మారిన ఎర్రమట్టి మాఫియాను సదరు పీఎస్ ఎస్‌హెచ్‌వో అండతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మండలాధ్యక్షుడు అడ్డూఅదుపు లేకుండా నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
మరో పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోపై ఇప్పటికే పలుమార్లు జిల్లా పోలీస్ అధికారికి బాధితులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ కేసు విషయంలో సంబంధిత ఎస్‌హెచ్‌వో ఓ బాధితుడిని తీవ్రంగా వేధించగా ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం. అయితే ఈ విషయం బయటకు రాకుండా బాధితుడి కుటుంబ సభ్యులను బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా బాధిత కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడి గోడు వెల్లబోసుకున్నా ఇప్పటివరకు సదరు ఎస్‌హెచ్‌వోపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు
పరిగి డివిజన్‌లోనూ ఓ ఎస్‌హెచ్‌వో సివిల్ తగాదాల్లో తలదూర్చుతూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు జిల్లాలో ప్రధానంగా ఇసుక లభ్యమయ్యే యాలాల, తాండూరు మండలాల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఒక్క యాలాల మండలంలోనే లక్షల క్యూబిక్ మీటర్లలో కాగ్నా నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు. ఈ ఇసుక దందాలోనూ పోలీసుల ప్రమేయం ఉందనే ప్రచారం జోరందుకున్నది. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.వేలల్లో వసూలు చేస్తూ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి.
ఇసుక దందాను అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే వెనుకుండి నడిపిస్తుండటంతో ప్రతిరోజూ జిల్లాలో ఏదో ఒక చోట అక్రమంగా ఇసుకను తరలిస్తూ పట్టుబడుతున్నప్పటికీ అక్రమ ఇసుక రవాణాకు మాత్రం అడ్డుకట్ట పడటంలేదు. అక్రమంగా ఇసుక తరలింపుపై నిఘా పెట్టి అడ్డుకోవాల్సిన పోలీస్ అధికారులు ఇసుక మాఫియా ఇచ్చే మామూళ్లతో చూసీచూడనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. మరోవైపు సదరు పోలీసు అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్లలోనే పనిచేయాలంటే స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పినట్లుగా నడుచుకోవాల్సి వస్తున్నది కాబట్టి వసూళ్ల పర్వం ఆగడం లేదనే ప్రచారం జరుగుతున్నది.