హైదరాబాద్,ఆగస్టు 4, (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ రివర్స్ పంపింగ్ విధానం ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువకు నీరందిస్తూ రైతులను ఆదుకుంటున్న కాళేశ్వరం తన ప్రాముఖ్యతను మరోసారి ఘనంగా చాటుకుంటున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కష్టకాలంలోనూ తెలంగాణ రైతులకు ఈ ప్రాజెక్టు నిరంతరం భరోసానిస్తున్నదని మంగళవారం ఎక్స్ వేదికగా గుర్తుచేశారు.
రివర్స్ పంపింగ్ విధానం ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువకు జీవం పోస్తూ, రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్ హౌస్ల ద్వారా నీటిని విజయవంతంగా ఎత్తిపోస్తున్నట్టు పేరొన్నారు. దీనివల్ల సుమారు 2 లక్షల ఎకరాల భూమికి సకాలంలో సాగునీరు అందుతున్నదని, రైతుల కండ్లల్లో ఆనందం చూస్తున్నామని వివరించారు.