హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా చేపడుతున్న పరిశోధనలు, ఆవిషరణలతో కూరగాయ పంటల్లో అధిక దిగుబడులు సాధ్యమవుతున్నాయని పలువురు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ లో తెలంగాణ ఉద్యాన వర్సిటీలో అఖిలభారత సమన్వయ పథకం 44వ వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. 300 మంది శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్యదర్శి కే సురేంద్రమోహన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొరత ఉన్న కూరగాయల సమస్యను పరిషరించడానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. దీనిలో భాగంగా 800 మందికిపైగా ఉత్తమ వలంటీర్లుగా రైతులను తీర్చిదిద్ది, వారితో ఇతరులకు శిక్షణ ఇస్తామని అన్నారు. 2047 నాటికి సుమారు 59.9 కోట్ల టన్నుల పంటల ఉత్పత్తులు అవసరమని తెలిపారు.
ఐకార్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుధాకర్పాండే మాట్లాడుతూ.. దేశంలో ఉద్యానరంగం ప్రాముఖ్యత రోజురోజుకూ పెరగడం శుభదాయకమని అన్నారు. 2047 నాటికి 747 బిలియన్ డాలర్ల విలువతో ఈ రంగం ఉంటుందని చెప్పారు. ఉద్యాన వర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ డీ రాజిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో మూడు లక్షల ఎకరాల్లో ఉన్న కూరగాయ సాగు లక్ష ఎకరాలకు పడిపోయిందని, మరో రెండింతల మేర ఈ విస్తీర్ణం పెరగాల్సిన అవసరం ఉన్నదని కోరారు. ఈ కార్యక్రమంలో బెంగళూరులోని ఐహెచ్ఆర్ డైరెక్టర్ డాక్టర్ టీకే బెహరా, ఎన్బీపీజీఆర్ డైరెక్టర్ డాక్టర్ జీపీ సింగ్, మాజీ వైస్ చాన్స్లర్ డాక్టర్ లవండి, ఎన్ఐఆర్సీఏ రాజమండ్రి డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్, పరిశోధన సంచాలకుడు లక్ష్మీనారాయణ, లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ అనితకుమారి, డాక్టర్ చీనా, డాక్టర్ పీ ప్రశాంత్ పాల్గొన్నారు.