మహబూబ్‌నగర్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న పారిశ్రామిక పార్కు కోసం సేకరించిన భూముల్లో ‘బిగ్ షాడో’గా వ్యవహరిస్తున్న ఓ కాంగ్రెస్ చోటా నేత ఏకంగా కుటుంబ సభ్యుల పేర్ల మీద రూ.మూడు కోట్ల 20 లక్షల పరిహారం పొందడం సంచలనం రేపింది. భూములు కోల్పోయిన రైతుల పరిహారంలో అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్ నేత పెద్ద ఎత్తున సర్కార్ భూముల్లో కుటుంబ సభ్యుల పేర్లు రాసుకొని ఏకంగా 16 ఎకరాలను దిగమింగడం చర్చనీయాంశమైంది.
నమస్తే తెలంగాణ వరుస కథనాలతో ఉలిక్కిపడిన వికారాబాద్ జిల్లా అధికార యంత్రాంగం హుటాహుటిన పారిశ్రామిక పార్కును సందర్శించింది. పరిహారంలో అక్రమాలు, వెంచర్లో నాసిరకం పనులను కలెక్టర్ గురువారం పరిశీలించారు. కేవలం 10 నిమిషాల్లోనే ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంపై రైతులు మండిపడుతున్నారు. కాగా ‘నమస్తే తెలంగాణ’ కథనాలపై ఉక్కిరిబిక్కిరవుతున్న షాడో సోషల్ మీడియాలో చిందులు తొక్కి చివరికి ఇంట్లో నాలుగ్గోడల మధ్య డాంబికాలకు పోయాడు.
పారిశ్రామిక పార్కులో హకీంపేట, లగచర్ల, పోలేపల్లి గ్రామాల పరిధి రైతుల నుంచి బలవంతంగా భూ సేకరణ చేయించి.. అంతా ఖాళీ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి.. కుటుంబ సభ్యుల పేరు మీద 16 ఎకరాల పొలం పోయినట్టు సృష్టించిన దొంగ రికార్డులు ‘నమస్తే తెలంగాణ’కు చిక్కాయి. కుటుంబ సభ్యులతో పాటు అక్క, బావలకు కూడా సంబంధం లేకున్నా ఇక్కడ భూమి పోయినట్టు పాస్‌బుక్కులు, పహాణీ రికార్డులను రెవెన్యూ అధికారులతో దిద్దించి మరీ రూ.మూడు కోట్ల 20 లక్షల పరిహారం నొక్కేసినట్టు బయట పడటం సంచలనం రేపింది.
పరిహారం కోసం ఏడాది నుంచి కాళ్లరిగేలా తిరుగుతున్న రైతులను వేధిస్తున్న ఉన్నతాధికారులు, బిగ్ షాడో ఫ్యామిలీకి అప్పనంగా పరిహారం అప్పజెప్పడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎకరాకు 20 లక్షల చొప్పున రూ.మూడు కోట్ల 20 లక్షలు నొక్కేసి నిర్వాసిత కాలనీలో 16 ప్లాట్లను కూడా కాజేసినట్టు సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.
ఇదే గ్రామంలో వచ్చి స్థిరపడ్డ ఓ ఆంధ్రా ఫ్యామిలీకి కూడా ఏకంగా రెండు ఎకరాల సర్కార్ భూమిలో రికార్డులు సృష్టించి నలభై లక్షల పరిహారం ఇప్పించి అందులో 75% కమీషన్ నొక్కి నిర్వాసిత కాలనీలో ఆ ఫ్యామిలీకి కూడా రెండు ప్లాట్లు రాయించి తన ఆధీనంలో ఉంచుకున్నట్టు తెలిసింది. 20 లక్షల పరిహారంతో పాటు అప్పనంగా ఎకరాకు 10 లక్షల చొప్పున దాదాపు మరో కోటీ 60 లక్షలు కూడా వెనుకేసుకున్నట్టు వినికిడి. ‘మన ఊరు- మన భవిష్యత్తు’ పేరుతో గ్రామంలో అవసరం లేకుండా రోడ్డు విస్తరణ చేసి పేదల ఇండ్లు కూలగొట్టి షాడో కుటుంబ సభ్యులు మాత్రం కొత్త ఇల్లు నిర్మించుకొని.. బాధితులను చుట్టూ తిప్పుకొంటున్నారు.