ఆర్మూర్‌టౌన్, ఆగస్టు 13: తీర్థయాత్రకు బయల్దేరిన భక్తులకు ఆర్మూర్ మండల పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జాతీయ రహదారిపై టైర్ పంక్చర్ కావడంతో ఆగిఉన్న టూరిస్ట్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొనడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతానికి చెందిన భక్తులు హైదరాబాద్‌లోని చిన్న జీయర్ స్వామి దర్శనం కోసం రెండు టూరిస్టు బస్సుల్లో బయల్దేరారు.
ఆర్మూర్ పట్టణంలోని గోవింద్‌పేట్ శివారులోఉన్న బ్రిడ్జి సమీపానికి చేరుకున్న సమయంలో ముందుగా వెళ్తున్న టూరిస్టు బస్సు టైర్ పంక్చర్ కావడంతో రెండు బస్సులను జాతీయ రహదారిపై నిలిపివేశారు. టైరు పంక్చర్ కావడంతో బస్సులోని కొంతమంది ప్రయాణికులు కిందకు దిగి, రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌పై కూర్చోని విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో వెనుక వైపు నుంచి వస్తున్న లారీ డ్రైవర్ ఆగిఉన్న టూరిస్టు బస్సును ఢీకొట్టాడు.దీంతో బస్సు ముందుకు కదిలి డివైడర్ ప్రాంతంలో కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో సుజాత(54), మాధవి(47) తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు సునీత,చిట్టక్కకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని, అక్కడ ఏర్పడిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సీపీ సాయి చైతన్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి ప్రమదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం,అతి వేగం తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.