రంగారెడ్డి, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : ఎన్నో ఏండ్ల కింద కొనుగోలు చేసిన ఇండ్లు, ప్లాట్లు నిషేధిత జాబితాలో చేర్చారని.. పైసాపైసా కూడబెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లల్లో ఇండ్లు నిర్మించుకున్నామని, ఆ ఇండ్లను సైతం నిషేధిత జాబితాలో చేర్చారని.. వాటిని అవసరాల నిమిత్తం అమ్ముకుందామన్న రిజిస్ట్రేషన్లు జరుగడంలేదంటూ వాపోతున్నారు. బాధితులను సంప్రదించకుండానే అధికారులు ఇష్టానుసారంగా నిషేధిత జాబితాను తయారు చేశారని వాపోతున్నారు. హైదరాబాద్ శివారుల్లో విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాలో 22ఏ నిషేధిత జాబితా తయారీ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాబితా తయారుచేసి ఐజీఆర్ఎస్లో పెట్టడంతోపాటు సంబంధిత ఎస్‌ఆర్‌ఓలకు కూడా జాబితాను పంపించారని ప్రజలు పేర్కొన్నారు. తాము ప్లాట్లు, ఇండ్లను అమ్ముకోవడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లగా రిజిస్ట్రేషన్లు నిలిపివేశామంటూ చెప్తుండటంతో దిక్కులేని స్థితిలో ఉన్నామని తెలిపారు.
నిషేధిత జాబితా తయారీలో ప్రభుత్వ భూములను చేర్చాల్సి ఉండగా.. అధికారులు ప్రైవేటు ఆస్తులను కూడా పొందుపర్చారు. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట్, ఆదిబట్ల, మహేశ్వరం, కందుకూరు, తుక్కుగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, గండిపేట్ వంటి ప్రాంతాల్లో ఎన్నో ఏండ్ల క్రితం ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకున్నవారు ఇప్పటివరకు ట్యాక్స్‌లు, కరెంటు బిల్లులు యథావిధిగా చెల్లిస్తున్నారు. తీరా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీస్తే నిషేధిత జాబితాలో చేర్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం క్రయవిక్రయాలు జరిగిన ప్లాట్లకు ఇదే పరిస్థితి. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్లను అడిగినప్పటికీ వారు తమ పరిధిలో లేదంటూ జిల్లా సబ్‌రిజిస్ట్రార్ వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు.
-ప్లాట్లు, ఇండ్ల అమ్మకాల కోసం అడ్వాన్సులు తీసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్తే నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల రంగారెడ్డిజిల్లా పరిధిలో గల తుక్కుగూడ, ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట్, శంషాబాద్, రాజేంద్రనగర్, శంకర్పల్లి, మొయినాబాద్, గండిపేట్ వంటి ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువ చేసే విల్లాలు, ప్లాట్లు రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలోకి వెళ్లిపోవడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో రూ.కోట్లు ఖర్చు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు హతాశులవుతున్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోనూ ఇదే పరిస్థితి.
ఇటీవల అధికారులు తయారుచేసిన 22ఏ నిషేధిత జాబితాపై పలువురు ఆందోళన బాట పడుతున్నారు. ముఖ్యంగా తాము కొనుగోలు చేసిన ప్లాట్లపై బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఇండ్లను నిర్మించుకుందామనుకున్న వారికి సైతం నిషేధిత జాబితాలో ఉండటం వలన రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు రావడంలేదు. ఎస్ఆర్వోలు రిజిస్ట్రేషన్ చేయడానికి నిరాకరిస్తున్నారు.
22ఏ జాబితాలో సుమారు 50వేల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్ ఆస్తులతోపాటు అనేక ప్రైవేటు ఆస్తులు, కోర్టు వివాదాలున్న ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో పలు విలువైన భూములతోపాటు యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలోని ఆలయ భూములు, వక్ఫ్ బోర్డు భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయి. దీంతో తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాల్సిన కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదుదారులు పోటెత్తుతున్నారు. నిషేధిత జాబితాలో చేర్చబడిన ప్లాట్లు, ఇండ్లు తమవే అంటూ సరైన పత్రాలు సమర్పించినప్పటికీ జాబితా నుంచి తొలగించడం లేదని వాపోతున్నారు. 22ఏ జాబితా తయారీపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తాము కొనుగోలు చేసిన ప్లాట్లు, ఇండ్లు ప్రభుత్వ స్థలంలో లేవని.. తమకు ఎన్ఓసీ ఇవ్వాలని బాధితులు తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జాబితాలో ఉన్న ప్లాట్లు, ఇండ్ల స్థలాలు తొలగించే బాధ్యత కలెక్టర్లపైనే ఉండటం వలన కలెక్టర్ల నుంచి అనుమతులు తీసుకోవడం కోసం బాధితులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నది. ఇదే అదునుగా ఎన్ఓసీలు ఇప్పిస్తామంటూ పలువురు పైరవీకారులు రంగంలోకి దిగుతున్నారు.