Buffer Zone | ప్రభుత్వం గీత గీస్తే లక్ష్మణరేఖలా ఉండాలి. పాలసీ అంటే బెంచ్‌మార్క్‌లా నిలువాలి. నిన్న ఒప్పు అయినది నేడు తప్పంటే.. కంచే చేనుమేసినట్టే! బఫర్ జోన్ల నిర్ధారణలో రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న తీరు సామాన్యులను సమిధలను చేస్తున్నది. మూసీని ముందు పెట్టి ఇండ్లు కూలగొట్టే యావలో ఉన్న ప్రభుత్వం బఫర్ జోన్లపై భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నది. గంటకో జీవో! రోజుకో నిబంధన! పూటకో పాలసీ! రేవంత్ సర్కారు తీరిది!
హైదరాబాద్ సిటీబ్యూరో, ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): రాజకీయ పార్టీలు, పాలకులు మారినా ప్రభుత్వ విధానాలు, నిబంధనలు ఒకేలా ఉండాలి. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో నిబంధనను తెరపైకి తెస్తున్నది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పేరిట గత రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పరివాహక ప్రాంత ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. నీటి వనరుల వద్ద బఫర్‌జోన్ నిర్ధారణపై స్పష్టమైన జీవోలు ఉన్నప్పటికీ ప్రభుత్వమే అందుకు విరుద్ధంగా మూసీ ప్రాజెక్టులో రాత్రికిరాత్రి బఫర్‌జోన్ పరిధిని పెంచింది. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే పరిధిని పెంచుతూ భూసేకరణకు నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో మూసీ-ఈసా నదీ మార్గంలోని పరివాహక ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. నదీమార్గంలో బఫర్ పరిధిని పెంచిన ప్రభుత్వం ఇదే విధానాన్ని జంట జలాశయాల పరిధిలో అమలు చేస్తే మంత్రుల సౌధాలే కాదు.. అనేకమంది కాంగ్రెస్ నేతలు, బడాబాబుల ఫాంహౌస్‌లు సైతం ఆ పరిధిలోకివచ్చి అక్రమ నిర్మాణాల జాబితా చాంతాడంత పెరుగుతుంది. ఇక ఇటీవల ఎల్ఆర్ఎస్-2020 దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులు, కుంటల చుట్టూ ఏకంగా 200 మీటర్ల బఫర్‌జోన్‌ను నిర్ధారించడం గమనార్హం.
నిన్నటిదాకా హైడ్రా కూల్చివేతలతో హడలెత్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరోసారి మూసీ పునరుజ్జీవనం అనే తేనెతుట్టెను కదిపింది. ఎగువన వికారాబాద్ జిల్లాలో ఒకవైపు మురికినీటితో మూసీనది కలుషితం అవుతుంటే అక్కడ నియంత్రించే చర్యలు మొదలుపెట్టకుండా భూసేకరణను ముందుపెట్టుకొని పరివాహక ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నది. మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాల ద్వారా నదిలోకి గోదావరిజలాలను వదిలాలని గతంలో నిర్ణయించారు. ఆ మూసీని మురికి కూపం నుంచి విముక్తి కల్పించేందుకు ఎస్టీపీలు నిర్మించడం, రవాణా మార్గాలను పెంచి, పచ్చదనాన్ని పెంపొందించడం వంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవనం పేరిట నదికి రెండువైపులా కిలోమీటరు పరిధిని అభివృద్ధి చేస్తానని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా ప్రకటించింది. అందులో భాగంగా వందల నిర్మాణాలను కూల్చివేసింది. ఇలా రెండున్నరేండ్లుగా మూసీ ప్రాజెక్టు అంటేనే పరివాహక ప్రాంత ప్రజలు ఉలిక్కిపడేలా చేసింది. కానీ ఇప్పటివరకు అసలు మూసీ ఎఫ్టీఎల్, బఫర్జోన్లను శాస్త్రీయంగా నిర్ధారించలేదు. అసలు మూసీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఎంత భూమిని సేకరించాలనుకుందనే విధానపరమైన నిర్ణయాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. తొలిదశలో భాగంగా గాంధీ సరోవర్ నిర్మాణానికిగాను భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టింది. మూసీ-ఈసా సంగమ ప్రాంతమైన బాపూఘాట్ వద్ద రూ.5 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు తెలుస్తున్నది.
గతంలో హైదరాబాద్ పరిధిలోని మూసీ పరివాహకంలో బఫర్‌జోన్ పరిధిని తొమ్మిది మీటర్లుగా పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. అందులో భాగంగానే బండ్లగూడ పరిధిలోని మధుపార్కు రిడ్జ్ నివాస సముదాయాలకు 2004లో అప్పటి హుడా అనుమతులు ఇచ్చింది. ఆపై ఉమ్మడి రాష్ట్రంలో భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించి 2012లో జారీ అయిన జీవో 168లో స్పష్టంగా బఫర్‌ను నిర్ధారించారు. చెరువులు, కుంటల విస్తీర్ణానికి అనుగుణంగా బఫర్‌ను నిర్ణయించగా.. గరిష్ఠంగా తొమ్మిది మీటర్ల వరకు పేర్కొన్నారు. నదులకు సంబంధించి 30 మీటర్లుగా బఫర్‌జోన్‌ను నిర్ధారించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఇవే నిబంధనలను అమలు చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం 168 జీవోకు సవరణలు చేసినప్పటికీ బఫర్‌జోన్ పరిధి జోలికి వెళ్లలేదు. అంటే ఆ జీవో ప్రకారమే బఫర్‌ను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ నెల పదో తేదీన మూసీ నది పరివాహక అభివృద్ధి సంస్థ ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్లో మూసీ నదికి రెండువైపులా 50 మీటర్ల బఫర్ పరిధిని పేర్కొంది.
దీంతో ఏ నదికైనా ఇరువైపులా బఫర్ 30 మీటర్లు ఉండాలి, కానీ ఏ జీవో ప్రకారం 50 మీటర్లకు పెంచారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు మధుపార్కు రిడ్జ్ నివాస సముదాయాలు 30 మీటర్లకు మించిన దూరంలో ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని తీసుకోవాలంటే నిబంధనల ప్రకారం 400 శాతం టీడీఆర్‌ను ఇవ్వాలి. కానీ బఫర్‌ను 50 మీటర్లుగా పేర్కొనడంతో ఆ ప్రాంతం 300 శాతం టీడీఆర్ పరిధిలోకి వస్తుంది. భూసేకరణ నోటిఫికేషన్లో రాజేంద్రనగర్, గండిపేట, గోల్కొండ మండలాల పరిధిలోని 15 గ్రామాలకు సంబంధించిన సర్వేనంబర్లను పేర్కొని వాటిల్లోని భూములు, నిర్మాణాలను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించి టీడీఆర్‌లు తీసుకోవాలని సూచించారు. కానీ ఏ సర్వేనంబర్లలో ఎంతభూమిని సేకరిస్తున్నారనేది పేర్కొనలేదు. అంటే ఎంత భూమిని సేకరించాలనే దానిపై స్పష్టత కరువైంది. ఒక అధికారి 250 ఎకరాలు అంటే మరో అధికారి 300 అంటున్నారు. ఇంకో అధికారి 50 మీటర్ల బఫర్‌జోన్ పరిధిలోకి వచ్చే భూములను తీసుకుంటామని చెప్తుండటంతో గందరగోళం నెలకొంది. మూసీ పొడవునా రెండువైపులా ఎఫ్టీఎల్కు 50 మీటర్ల దూరాన్ని బఫర్‌గా నిర్ధారిస్తే 55 కిలోమీటర్ల దూరంలోని గౌరెల్లి వరకు వేలాది నిర్మాణాలు ఈ జోన్లోకి రానుండటంతో పరివాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం మూసీని ఉద్ధరిస్తానంటున్నది… అంటే అందులో జంట జలాశయాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో నదీ మార్గంలో 50 మీటర్ల బఫర్‌ను నిర్ధారించినపుడు జంట జలాశయాల చుట్టూ కూడా బఫర్‌జోన్‌ను అంతేదూరంలో అమలు చేయాలి. ప్రస్తుతం హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిలోనే అనేకమంది కాంగ్రెస్ మంత్రులు, నేతల ఫాంహౌస్‌లు, నిర్మాణాలు ఉన్నాయి. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితోపాటు అనేకమంది ప్రముఖుల ఇండ్లు, ఫాంహౌస్‌లు అక్కడ ఉన్నాయి. గతంలో వీళ్లు 30 మీటర్ల దూరంలో ఉన్నందున బఫర్‌జోన్ తమకు వర్తించదని ప్రకటనలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వమే 50 మీటర్ల బఫర్‌ను నిర్ధారించినందున కచ్చితంగా వీళ్ల నిర్మాణాలు బఫర్లోనే ఉన్నాయనేది సుస్పష్టం. మరి.. సామాన్యులకు అమలు చేసిన నిబంధన ప్రకారం జంట జలాశయాల చుట్టూ 50 మీటర్ల బఫర్‌జోన్‌ను అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
2004లో ఇక్కడ అపార్ట్మెంట్ కట్టుకునేందుకు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నం. బఫర్ జోన్లో లేదని అప్పుడు అనుమతినిచ్చారు. ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్నదని అంటున్నరు. మీ ఇష్టానుసారం నిబంధనలు మార్చుకుని మాకు అన్యాయం చేస్తారా? నదీగర్భమేది? పరీవాహకమేది? ఎక్కడిదాక బఫర్? అనే స్పష్టత సర్కార్‌కు ఉన్నదా?
– జీవీ శేఖర్, మధు పార్క్ అపార్ట్మెంట్ అసోసియేషన్ సెక్రటరీ