Pradeep Rawat | సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగంలో ఉన్నారు. బ్లడ్ క్యాన్సర్‌తో కన్నుమూసిన ప్రదీప్ రావత్ చివరి రోజుల గురించి ఆయన కుమారుడు విక్రమాదిత్య మీడియాతో పంచుకున్న విషయాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. తండ్రి అనారోగ్యం ఎలా మొదలైంది? చివరి క్షణాల్లో ఏం జరిగింది? అనే విషయాలను గుర్తు చేసుకుంటూ విక్రమాదిత్య భావోద్వేగానికి లోనయ్యారు. విక్రమాదిత్య తెలిపిన వివరాల ప్రకారం.. మొదట ప్రదీప్ రావత్‌కు కడుపునొప్పి రావడంతో సాధారణ ఇన్ఫెక్షన్గా భావించి వైద్యులను సంప్రదించారు. మందులు వాడినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోగా మరింత క్షీణించింది. ఆ సమయంలో కుటుంబ సభ్యుల ఆందోళనతో రక్త పరీక్షలు చేయించగా, తెల్ల రక్త కణాల సంఖ్య అసాధారణంగా పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించగా, ఆయనకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
రెండు నెలల క్రితమే అన్ని హెల్త్ చెకప్‌లు చేయించాం. అప్పటికి అన్నీ సాధారణంగానే ఉన్నాయి. కానీ కేవలం నెలన్నర వ్యవధిలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంత వేగంగా వ్యాధి తీవ్రరూపం దాల్చుతుందని మేమెప్పుడూ ఊహించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి చివరి క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మేమంతా ఐసీయూ బయటే నిలబడి ఉన్నాం. డాక్టర్లు నాన్నకు సీపీఆర్ చేస్తున్న దృశ్యం తలుపు సందులోంచి కనిపించింది. ఆ క్షణంలోనే ఆయనను ఇక కాపాడలేమని నాకు అర్థమైంది అంటూ విక్రమాదిత్య భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన అభిమానులు, సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులందరికీ ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో హాజరై తమ తండ్రికి ఘనంగా నివాళులర్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ప్రదీప్ రావత్ తన కెరీర్లో హిందీ, తెలుగు, తమిళం సహా పలు భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘లగాన్’, ‘గజిని’, ‘మహాభారత్’, అలాగే తెలుగులో ‘సై’, ‘ఛత్రపతి’, ‘స్టాలిన్’, ‘దేశముదురు’, ‘సరైనోడు’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. పవర్ఫుల్ విలన్‌గా మాత్రమే కాకుండా తన సహజ నటన, సున్నితమైన వ్యక్తిత్వంతో సహచరుల అభిమానాన్ని సంపాదించుకున్న ప్రదీప్ రావత్ మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటుగా సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఆయన నటన, ఆయన వ్యక్తిత్వం, అభిమానులపై చూపిన ప్రేమ చిరస్థాయిగా గుర్తుండిపోతాయని అభిమానులు నివాళులర్పిస్తున్నారు.