Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పల్లెల నుంచి పట్టణాల వరకు భారీ స్థాయిలో రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు-భవనాల శాఖ, ఇతర నిధులతో మొత్తం 307 కిలోమీటర్ల మేర 611 రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే రూ.100 కోట్ల వ్యయంతో 152 కిలోమీటర్ల మేర 611 రోడ్ల పనులు పూర్తి కాగా, మరో 70 రోడ్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది. మొత్తం ప్రాజెక్టులో దాదాపు 80 శాతం పనులు పూర్తికావడంతో పిఠాపురం నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో రవాణా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి.
ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర అలల కోత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న మాయాపట్నం మత్స్యకారులకు గతంలో సుబ్బంపేట సమీపంలో పునరావాస కాలనీ ఏర్పాటు చేశారు. అయితే అక్కడ మౌలిక సదుపాయాల కొరత ఉండటంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్పందించారు. రూ.1.52 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 2.8 కిలోమీటర్ల డ్రెయినేజీ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. అలాగే కొత్తసూరాడపేట కాలనీలో రూ.93 లక్షలతో 1.6 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించి, వాటిని సుబ్బంపేట–కొత్తపల్లి ప్రధాన రహదారితో అనుసంధానం చేశారు. యు.కొత్తపల్లి మండలంలోని అమరవిల్లి–రామన్నపాలెం బీచ్ రోడ్ తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ.88 లక్షలతో రహదారిని పునర్నిర్మించారు. దీంతో బషీర్ బీబీ ఆలయానికి వెళ్లే భక్తులతో పాటు స్థానిక ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడింది.
అభివృద్ధికి దూరంగా ఉన్న ఎస్ఈజెడ్ పరిధిలోని ముమ్మడివారిపాడు గ్రామానికి కూడా శాశ్వత రహదారి సౌకర్యం కల్పించారు. రూ.79.70 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డు గ్రామ అభివృద్ధికి కొత్త ఊపునిచ్చింది. అలాగే కొత్తపల్లి గ్రామంలో శ్మశానవాటికకు వెళ్లే మార్గంలో రూ.26.30 లక్షలతో 411 మీటర్ల సీసీ రోడ్డు నిర్మించడంతో దాదాపు నాలుగు వేల మంది ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగింది. కొండెవరం గ్రామ పంచాయతీ పరిధిలో పిఠాపురం–ఉప్పాడ ఆర్ అండ్ బీ రహదారి గత ఏడు సంవత్సరాలుగా దెబ్బతిని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ రహదారిని రూ.1.22 కోట్ల ఉపాధి హామీ నిధులతో 3.17 కిలోమీటర్ల మేర యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ఈ రహదారి ద్వారా విద్యార్థులు, రైతులు, వ్యాపారులు సహా వేలాది మంది ప్రజల రాకపోకలు సులభమయ్యాయి.