మహానగరానికి మంచినీటి కరువు పొంచి ఉంది. కొద్ది రోజుల్లోనే తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల సిటీకి నీటిఎద్దడి నెలకొన్నది. ఒక్క భారీ వర్షం పడకపోవడంతో బోర్లన్నీ ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లోని ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. భూగర్భ జలాలు గతేడాది ఆగస్టు కంటే ఈ ఆగస్టులో 5 మీటర్ల లోతుకు పడిపోయాయి. నగరంలో విచ్చలవిడిగా బోర్లు తవ్వుతున్నారు.
రెవెన్యూ అధికారులు కనీస తనిఖీలు చేపట్టకపోవడంతో నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎక్కడపడితే అక్కడ వెయ్యి నుంచి రెండు వేల లోతులో బోర్లు వేసి నీటిని జలగల్లా పీల్చేస్తున్నారు. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్న చోట్ల బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా తోడేస్తున్నారు. నీళ్లన్నీ అక్రమార్కులు పీల్చేస్తుండటంతో ప్రజలు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 46 మండలాలుంటే 45 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. నగరమంతా కాంక్రీట్ జంగిల్‌గా మారడంతో నీరు ఇంకే పరిస్థితులు లేకపోవడంతో ఆందోళన కలిగిస్తున్నది. ఇండ్లలో బోర్లు ఎండిపోయి, జలమండలి నీళ్లు అరకొరగా వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
సిటీ బ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో భూగర్భ జలాలు గతేడాది ఆగస్టు నెలలో యావరేజిగా 6.36 మీటర్ల దిగువన ఉన్నాయి. ఈ ఏడాది దాదాపు 5 మీటర్ల దిగువకు పడిపోయి 11.20 మీటర్ల కిందికి చేరుకున్నాయి. గతంతో పోలిస్తే ఒక ఏడాదిలోని నేరుగా 5 మీటర్లు దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి అని భూగర్భ శాస్త్ర నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు హైదరాబాద్‌కు ఉత్తర ప్రాంతం, వాయువ్యం, తూర్పు ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లా పరిసరాల్లో ఎక్కువగా దిగువకు చేరుకున్నాయి. ముఖ్యంగా కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి పరిసరాల్లో భూగర్భ జలాలు ఆందోళనకరంగా పడిపోతున్నాయి.
ఈ ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పెరుగుతుండంతో అంతే వేగంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. కుత్బుల్లాపూర్‌లో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా 39.89 మీటర్ల కింద పాతాళానికి పడిపోయాయి. గతేడాది తిరుమలగిరి ప్రాంతంలో 14.15 మీటర్ల లోతులో ఉంటే ఈఏడాది అది రెట్టింపై 27.74 మీటర్లకు పడిపోయింది. ఇది ప్రతి ఏటా 13.73 నుంచి 17.68 మీటర్లుగా నమోదవుతున్నది. మారేడ్‌పల్లిలో భూగర్భ జలాలు 12.97 మీటర్ల దిగువకు చేరుకున్నాయి.
శేరిలింగంపల్లి, మేడిపల్లి, మేడ్చల్, ఉప్పల్, కూకట్‌పల్లితో పాటు హఫీజ్‌పేటలో రికార్డు స్థాయిలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులు ఈ సీజనంతా ఇలాగే కొనసాగితే పరిస్థితులు మరింత దిగజారే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సీజన్లో ఇప్పటిదాకా నగరంలో కురవాల్సిన దానికంటే తక్కువ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ జిల్లాకు సెప్టెంబర్ చివరి నాటికి సాధారణ వర్షపాతం సెప్టెంబర్ 29 వరకు 613 మిల్లీమీటర్ల కురవాల్సి ఉండగా ఇప్పటిదాకా కేవలం 458 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. 25 శాతం తక్కువగా కురిసింది. రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ కంటే కొంత మేర ఎక్కువగానే కురిసింది. అయినా కావల్సిన దాని కంటే తక్కువే నమోదైంది.
ఇప్పటి దాకా 532 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా కేవలం 466 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. 12 లోటు శాతం నమోదైంది. మేడ్చల్ జిల్లాల్లో వర్షపాతం దారుణంగా పడిపోయింది. జిల్లాలో ఇప్పటిదాకా 588 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా ఇప్పటిదాకా అత్యంత తక్కువగా 407 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఏకంగా 31 శాతం లోటు వర్షం కురిసింది. వర్షాకాలం మరో నెల రోజులు మాత్రమే ఉండటంతో అక్టోబర్‌లో వర్షాలు విస్తృతంగా కురిస్తేనే నగరంలో కొంత మేర కష్టాలు తగ్గే అకాశం ఉంది. కానీ వర్షాభావ పరిస్థితులు ఇదేవిధంగా కొనసాగితే డిసెంబర్ నుంచే వేసవి పరిస్థితులు నెలకొంటాయని అధికారులు చెబుతున్నారు. నగరంలో భూగర్భ జలాలు అత్యంత వేగంగా అడుగంటుతుండగా జలమండలి ద్వారా తాగునీటిని అందించే సింగూరు, మంజీరా జలాశయాల నీటి మట్టాలు వేగంగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కనీసం ఎగువ ప్రాంతాల్లోనైనా వర్షం కురిస్తే జలాశయాల్లోకి నీరు చేరి పరిస్థితులు కొంత మేర అదుపులో ఉండే ఛాన్సు ఉంటుంది.
