రాయపోల్, సెప్టెంబర్ 16: పోలీసుకళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమం సోమవారం రాత్రి సిద్దిపేట జిల్లా బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తొగుట సీఐ లతీఫ్, బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గంజాయి ఇతర మత్తుపదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరితో తిరుగుతున్నారని ఒక కన్నేసి ఉంచాలని తెలిపారు. ఎవరైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలు అయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. వారికి సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో ఉన్న డీ-అడిక్షన్ సెంటర్లో చికిత్స, కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు.
ఆశ, భయం, మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. బ్యాంకు అధికారులమని చెప్పి ఫోన్ చేస్తే నమ్మవద్దని, అకౌంట్ వివరాలు, వ్యక్తిగత వివరాలను గుర్తుతెలియని వ్యక్తులతో పంచుకోవద్దని వెల్లడించారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
ఇప్పుడే వస్తాం, తక్కువ దూరం కదా అని హెల్మెట్ పెట్టుకోకుండా అశ్రద్ధ చేయవద్దని, రోడ్డు ప్రమాదం ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవ్వరూ ఊహిర్రన్నారు. ఎంత పెద్ద రోడ్డు ప్రమాదమైన తలకు దెబ్బతలగకుండా ఉంటే బతికే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రోడ్లు విశాలంగా ఉండటంతో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మోటార్ సైకిల్ నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకోసం గ్రామ ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. ఆన్ లైన్ గేమ్స్ ఆడి మీరు మీ కుటుంబాలను రోడ్డున పడవేయవద్దని యువతకు సూంచించారు.
చెరువులు కుంటలు వాగులు, వంకలు నిండి ఉన్నందున పిల్లలతో జాగ్రత్తగా ఉండాలన్నారు.
మూఢ నమ్మకాలు, చేతబడులు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలు, సామాజిక రుక్మతల గురించి సిద్దిపేట పోలీస్ కళాబృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, తెలంగాణ సాంస్కృతిక సారధి సభ్యులు శ్యాంసుందర్, కనకయ్య, హరిప్రసాద్, బిక్షపతి, రత్నం, శ్రీనివాస్, సిద్ధులు, శైలజ నాటకం, పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువతి యువకులు, తదితరులు పాల్గొన్నారు.