Gold | తొగుట: బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ దొంగలు, మోసగాళ్లు కూడా కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. మీ బంగారు ఆభరణాలను కొత్తవాటిలా మెరిపిస్తాం.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా శుభ్రం చేస్తాం అంటూ ఇంటి గుమ్మం తట్టిన ఇద్దరు కేటుగాళ్లు అమాయక మహిళను నమ్మించి క్షణాల్లో 9 గ్రాముల బంగారాన్ని కాజేసిన ఘటన మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో కలకలం రేపింది.
శనివారం ఉదయం గ్రామంలోకి వచ్చిన ఇద్దరు యువకులు తమ వద్ద ఉన్న పౌడర్, రసాయన ద్రావణాలను చూపిస్తూ బంగారం, వెండి ఆభరణాలను మెరిపిస్తామని ప్రచారం చేశారు. మొదట పలువురు వారి మాటలను నమ్మకపోయినా, గ్రామానికి చెందిన కళ్లెపు అనూష ఇంటి వద్దకు చేరుకున్న వారు తమ మాయమాటలతో ఆమెను నమ్మించారు.
ముందుగా ఆమె చేతులపై పౌడర్ వేసి చల్లదనాన్ని అనుభూతి చెందేలా చేసి, తమ వద్ద ఉన్న పదార్థాలు నిజంగానే పనిచేస్తాయని నమ్మించారు. అనంతరం ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడు, ఆమె చెల్లి కాళ్లలోని వెండి పట్ట గొలుసులను తీసుకుని ప్రత్యేక లిక్విడ్లో శుభ్రం చేస్తామని చెప్పారు.
అయితే ఆ ప్రక్రియలోనే అత్యంత చాకచక్యంగా బంగారంలో కొంత భాగాన్ని కరిగించి, మిగిలిన ఆభరణాలను తిరిగి అప్పగించి అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటికే ఆభరణాల బరువు తగ్గినట్లు అనుమానం రావడంతో స్థానిక బంగారు దుకాణంలో తూకం వేయించగా సుమారు 9 గ్రాముల బంగారం మాయమైనట్లు తేలింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు షాక్కు గురై లబోదిబోమంటూ విలపించారు.
ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. బంగారం మెరిపిస్తామంటూ, శుభ్రం చేస్తామంటూ ఇంటింటికి తిరిగే అపరిచితులను నమ్మవద్దని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో ఇలాంటి మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న తొగుట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఈ కేటుగాళ్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.”అపరిచితుల మాయమాటలు నమ్మితే.. క్షణాల్లో కష్టార్జితం కరిగిపోతుంది” అంటూ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.